18 కోట్లతో తీస్తే 240 కోట్ల వసూల్.. రీమేక్ ససేమిరా..!
అలాంటి ప్రయత్నం చేస్తే కంటెంట్ పరంగా సాంస్కృతిక సంబంధం పోతుందని అన్నాడు.
పరిమిత బడ్జెట్ లో తెరకెక్కి సంచలన విజయం సాధించిన `మంజుమ్మెల్ బాయ్స్` గురించి ఔత్సాహిక ఫిలింమేకర్స్ లో చాలా చర్చా గోష్టి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పటికీ ఘనత వహించిన ఈ సినిమాపై ఫిలింమేకర్స్ అందరిలోను క్యూరియాసిటీ నెలకొంది. క్రిటికల్ గా మెప్పించడమే గాక బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయం సాధించిన ఇలాంటి గొప్ప సినిమాని పొరుగు భాషల్లో రీమేక్ చేస్తారా? అన్న చర్చా సాగుతోంది. అయితే ఇప్పుడు దర్శకుడు చిదంబరం ఈ చిత్రాన్ని మరో భాషలోకి రీమేక్ చేయాలనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకనిర్మాతగా తాను రీమేక్‌లకు సిద్ధంగా ఉన్నానని, అయితే మంజుమ్మెల్ బాయ్స్ వంటి చిత్రాన్ని మరే ఇతర భాషలోనూ తీయకూడదని అన్నారు. అలాంటి ప్రయత్నం చేస్తే కంటెంట్ పరంగా సాంస్కృతిక సంబంధం పోతుందని అన్నాడు.
చిదంబరం మాట్లాడుతూ-``ఇది నిజమైన గుహలో జరిగిన.. వ్యక్తులకు సంబంధించిన నిజమైన కథ. కేరళ ప్రజలు, తమిళనాడు ప్రజల సాంస్కృతిక అనుబంధం. సినిమా నడపడానికి (విజయవంతంగా) చాలా అంశాలు ఉన్నాయి. అయితే రీమేక్ చేస్తే అది ఎంత వరకు ఒరిజినాలిటీతో తెరపై అనువదించగలరో నాకు తెలియదు``అని వ్యాఖ్యానించారు. `మంజుమ్మెల్ బాయ్స్` సినిమాని మరే ఇతర భాషలో రీమేక్ చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నానని ఆయన అన్నారు. ఇది స్వచ్ఛమైన మానవీయ కథ! అని, అది గొప్ప చిత్రం కావడానికి అన్ని అంశాలు తెరపై ఉన్నాయి. ఇలాంటి సినిమా ఇదే తొలిసారి కాబట్టి ఎవరూ తీయరని కూడా అన్నారు. నా చిత్రం `యూనివర్సల్ స్టోరీ` అయినందున ప్రజలు దానితో కనెక్ట్ అయ్యారని కూడా దర్శకుడు చిదంబరం అన్నారు. తన తదుపరి సినిమా గురించి అతడు వివరాలు అందించారు. ``ఈసారి కూడా మానవ భావోద్వేగాలు, నాటకం ఉన్న కథ. హింస తాలూకా అనాటమీని నేను అన్వేషిస్తున్నాను`` అని అన్నారు.
మంజుమ్మెల్ బాయ్స్ వివరాల్లోకి వెళితే.. ఇది గుణ గుహలలో జరిగిన నిజ జీవిత విషాదం ఆధారంగా రూపొందించిన సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రం ఈ సంవత్సరం విడుదలైంది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కొడైకెనాల్‌కి విహారయాత్రకు వెళ్లే స్నేహితుల బృందం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అయితే వారిలో ఒకరు 800 అడుగుల లోతున్న గొయ్యిలో పడి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటాడు. అయినప్పటికీ, స్నేహితులు అతడిని రక్షించడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టరు.
మంజుమ్మెల్ బాయ్స్ 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించగా, ప్రపంచవ్యాప్తంగా 240 కోట్లు పైగా వసూలు చేసింది. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, దీపక్ పరంబోల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.