రజనీ కష్టాలు ఇన్నిన్ని కావు..

Update: 2018-11-04 04:28 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి తరచుగా సినిమాలు ఆశిస్తారు అభిమానులు. కానీ ఆయనకు ఆరోగ్యం సహకరించదు. కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. కొన్ని నెలల పాటు విదేశాల్లో ఉండి చికిత్స చేయించుకున్నారాయన. పూర్తిగా కోలుకున్నారని అనుకున్నాక కూడా ఇబ్బందులు పడ్డారు. గత ఏడాది ‘2.0’ చిత్రీకరణ సమయంలోనూ రజనీ అనారోగ్యం పాలై బాగా ఇబ్బంది పడ్డారని వార్తలొచ్చాయి. దీని గురించి ‘2.0’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయనే స్వయంగా ప్రస్తావించారు.

ఈ చిత్రం కోసం 15 కిలోలకు పైగా బరువున్న సూట్ ధరించాల్సి వచ్చేదని.. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని.. ఎండలో ఆ సూట్ వేసుకుని షూటింగ్ చేస్తుంటే.. ఇంత కష్టం ఏంటి అనిపించిందని.. ఈ కష్టం పడలేక ఒక దశలో సినిమా నుంచి తప్పుకుందామని కూడా అనిపించిందని రజనీ తెలిపాడు. ఐతే శంకర్ మాత్రం ఈ సినిమా మీరే చేయాలి అని పట్టుబట్టాడని చెప్పాడు. ఒక సమయంలో తన ఆరోగ్యం బాగా దెబ్బ తినడంతో నాలుగు నెలల పాటు షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందని.. అయినా కూడా దర్శకుడు శంకర్.. నిర్మాతలు ఓపిగ్గా ఎదురు చూశారని అన్నాడు.

మొత్తానికి ‘2.0’ షూటింగ్ సందర్భంగా సూపర్ స్టార్ మామూలు అవస్థలు పడలేదని స్పష్టమవుతోంది. ఐతే ఇంత కష్టం పడ్డాక.. వెంటనే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘పేట్టై’ మొదలుపెట్టి నాలుగు నెలల్లో పూర్తి చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తున్న నేపథ్యంలో ఇకపై రజనీ సినిమాల విషయంలో రిస్క్ తీసుకుంటారా అన్నది సందేహమే. శంకర్ చూస్తే ‘3.0’ ఐడియా కూడా చెబుతున్నాడు కానీ.. రజనీకైతే ఇంకో సినిమా.. అందులోనూ ఎంతో శ్రమతో కూడుకున్న ‘రోబో’ సిరీస్‌ లో సినిమా చేయడం డౌటే.


Tags:    

Similar News