జయకు రజనీకాంత్ నివాళి.. గతం గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతిని పురస్కరించుకుని రజనీకాంత్ ఆమె నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 77వ జయంతిని పురస్కరించుకుని పోయెస్ గార్డెన్ లో ఉన్న ఆమె నివాసానికి వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా... జయ మేనకోడలు, మేనల్లుడితో కలిసి ఆయన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా... జయలలితను కొనియాడారు.
అవును... తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతిని పురస్కరించుకుని రజనీకాంత్ ఆమె నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పందించిన రజనీ.. సినీపరిశ్రమలో జయ బిజీగా ఉన్నప్పుడే ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చింద్ని పేర్కొన్నారు. తాను జయలలిత ఇంటికి రావడం ఇది నాల్గోసారి అని గుర్తుచేసుకున్నారు.
ఇందులో భాగంగా... 1977లో జయలలితతో కలిసి నటించే అవకాశం రాగా.. దాని గురించి మాట్లాడేందుకు మొదటిసారిగా ఆమె నివాసానికి వచ్చానన్నారు. ఆమె మన మధ్య లేకపోయినా ఆమె అందించిన సేవల్ని ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని ఆమె కీర్తి ప్రతిష్టలు కలకాలం వర్థిల్లాలని కొనియాడారు.
మరోపక్క... జయలలిత 77వ జయంతిని పురస్కరించుకుని పలువురు ఆమెను నివాళులర్పించారు. ఈ సందర్భంగా... అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పార్టీ నాయకులు చెన్నై రాయపేటలోని ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని మాజీ ముఖ్యమంత్రి జయలలిత విగ్రహానికి మాలవేసి నివాళులర్పించారు.
ఇదే సమయంలో.. మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ ఆధ్వర్యంలో అన్నాడీఎంకే అమ్మా పేరవై తరుపున తయారు చేసిన 77 కిలోల కేక్ కట్ చేసి, పంచిపెట్టారు. ఈ సందర్భంగా... "పురట్చి తలైవి అమ్మా 77వ జయంతి వేడుక" ప్రత్యేక సంచిక విడుదల చేసి.. తొలి సంచికను పార్టీ కోశాధికారి దిండుక్కల్ శీనివాసన్ కు అందించారు.
అదేవిధంగా... మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పరిరక్షణ కమిటీ సమన్వయకర్త పన్నీర్ సెల్వం, అతని మద్దతుదారులతో కలిసి చెన్నై కామరాజర్ సాలైలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వద్ద ఉన్న జయలలిత విగ్రహం దగ్గర అలంకరించిన జయలలిత విత్రపటానికి మాలవేసి నివాళులర్పించారు.