టైముకు రావడం 'కాలా'కు కష్టమే

Update: 2018-03-23 07:28 GMT
ర‌జినీకాంత్ న‌టించిన రోబో సీక్వెల్‌గా రూపొందిన ‘2.0’ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వ‌ర్క్ పూర్తికాక‌పోవ‌డంతో సుదీర్ఘ‌ వాయిదా ప‌డింది. దాంతో ఆ త‌ర్వాత రావ‌ల్సిన ‘కాలా’ చిత్రాన్ని ముందుకు తీసుకుని, 2.0 విడుద‌ల తేదీన విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఆ చిత్ర నిర్మాత‌లు. అయితే ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో జ‌రుగుతున్న పరిస్థితులను బ‌ట్టి చూస్తే, కాలుడు కూడా స‌మ‌యానికి రావ‌డం డౌటే అనిపిస్తోంది.

డిజిట‌ల్ ప్రొవైడ‌ర్ల‌కీ, ద‌క్షిణాది నిర్మాత‌ల‌కి మ‌ధ్య వీపీఎఫ్ విష‌యంలో వివాదం రేగిన విష‌యం తెలిసిందే. దాంతో మార్చి 2 నుంచి ద‌క్షిణాదిన థియేట‌ర్ల‌న్నీ మూత‌బ‌డ్డాయి. చ‌ర్చ‌ల త‌ర్వాత తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీల‌లో థియేట‌ర్లు తెరుచుకున్నా త‌మిళ ఇండ‌స్ట్రీలో మాత్రం బంద్ అలాగే కొనసాగుతోంది. నిర్మాత‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌ని డిమాండ్ చేస్తూ త‌మిళ్ ఫిల్మ్స్‌ ప్రొడూస‌ర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) పిలుపుతో కోలీవుడ్‌లో నిర‌వ‌ధిక బంద్ జ‌రుగుతోంది. మార్చిలో విడుద‌ల కావ‌ల్సిన సినిమాల‌న్నీ వాయిదా ప‌డ్డాయి. అయితే సెన్సార్ పూర్తిచేసుకుని, వాయిదా ప‌డిన చిత్రాల‌ను బంద్ ముగిసిన తర్వాత వ‌రుస‌గా విడుద‌ల చేయ‌బోతున్నారు. మొద‌ట సెన్సార్ చేసుకున్న చిత్రాల‌కు విడుద‌ల విష‌యంలో మొద‌టి ప్రాధ‌న్యం ఉంటుంది.  అయితే ఎప్పుడో షూటింగ పూర్తిచేసుకున్న రజినీ ‘కాలా’ సినిమాను ఇప్ప‌టికీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేయ‌లేదు.

ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకుని విడుద‌ల కోసం ఎదురుచూస్తున్న సినిమాలు వారానికి రెండు, మూడు చొప్పున వ‌చ్చినా ర‌జినీ ‘కాలా’ విడుద‌ల‌కు చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది. ఆయ‌న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ‘కాలా’ వ‌చ్చాక రెండు మూడు వారాల దాకా వేరే సినిమాల‌కు అవ‌కాశం ఉండ‌దు. సో... క‌రికాలుడు స‌మ‌యానికి రావ‌డం క‌ష్ట‌మే అంటున్నారు విశ్లేష‌కులు.
Tags:    

Similar News