'రాక్షసుడు 2' లో నటించే స్టార్ హీరో అతనేనా..?

Update: 2021-07-14 08:57 GMT
తమిళంలో సూపర్ హిట్ అయిన 'రాక్షసన్‌' చిత్రాన్ని తెలుగులో ''రాక్షసుడు'' పేరుతో రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దర్శకుడు సొంతగా కథ రెడీ చేసుకొని 'రాక్షసుడు' చిత్రానికి సీక్వెల్‌ చేయాలని సంకల్పించారు. ''రాక్షసుడు 2'' చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ని విడుదల చేసి 'హోల్డ్‌ యువర్‌ బ్రీత్' అంటూ ఆసక్తిని కలిగించారు. అయితే ఈ సినిమాలో నటించబోయే హీరో ఎవరనేది ప్రకటించలేదు.

'రాక్షసుడు 2' చిత్రంలో ఓ స్టార్ హీరో నటించబోతున్నాడని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమాలో నటించే ఆ స్టార్ హీరో గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే మేకర్స్ చెప్పిన ఈ ప్రముఖ హీరో టాలీవుడ్ కు చెందిన వ్యక్తి కాదంట. తమిళం నుంచి దిగుమ‌తి చేసుకోబోతున్నారట. దీని కోసం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుప‌తి - శివ‌ కార్తికేయ‌న్ వంటి హీరోల పేర్లను పరిశీలించిన మేకర్స్.. సేతుప‌తి వైపే మొగ్గు చూపారని టాక్ వినిపిస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ విజయ్ సేతుపతి కి ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది.

'పిజ్జా' 'పేట' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విజయ్ సేతుపతి.. 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఈ క్రమంలో 'ఉప్పెన' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. ఈ నేపథ్యంలో ''రాక్షసుడు 2'' చిత్రాన్ని తెలుగు తమిళ బైలింగ్విల్ గా రూపొందించాలని ప్లాన్ చేసిన మేకర్స్.. సేతుపతి ని లీడ్ రోల్ కోసం సంప్రదించారట. రమేష్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో.. వర్సటైల్ యాక్టర్ పాజిటివ్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి వరుస ప్రాజెక్ట్స్ తో ఏడాది పొడవునా బిజీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. డేట్స్ అడ్జస్ట్ చేయలేక పలు పాన్ ఇండియా చిత్రాలను ఆయన వదులుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు 'రాక్షసుడు 2' కోసం సేతుపతి డేట్స్ అడ్జస్ట్ మెంట్ చేసుకొని గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాలి. ఒకవేళ విజయ్ సేతుపతి 'రాక్షసుడు' సీక్వెల్ లో భాగం అయితే మాత్రం.. ఇది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రమేష్ వర్మ ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ తో 'ఖిలాడి' సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తైన తర్వాత ''రాక్షసుడు 2'' సినిమా ప్రారంభం కానుంది. 'రాక్షసుడు' చిత్రం కోసం పని చేసిన సాంకేతిక బృందం మొత్తం 'రాక్షసుడు 2' లో భాగం అవుతున్నారు. ఎ స్టూడియోస్‌ సమర్పణలో హవిష్ ప్రొడక్షన్‌ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ మరియు శ్రీకాంత్ విస్సా కలిసి ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేయబోతుందో చూడాలి.
Tags:    

Similar News