ఇక్కడి సవాలుని అక్కడి దాకా తీసుకెళ్లిన చరణ్...!

Update: 2020-04-21 15:53 GMT
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మొదలు పెట్టిన 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ ప్రస్తుతం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది. సందీప్ వంగా శ్రీకారం చుట్టిన ఈ ఛాలెంజ్‌ ను ఇప్పుడు పలువురు స్వీకరించ‌డమే కాక త‌మ ఫ్రెండ్స్‌ కి కూడా విసురుతున్నారు. ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయడమే ఈ ఛాలెంజ్‌ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సందీప్ వంగా ఛాలెంజ్‌ ని స్వీకరించిన రాజమౌళి ఈ ఛాలెంజ్‌ ని పూర్తి చేసి రామ్‌ చరణ్ - ఎన్టీఆర్‌ - కీరవాణి - శోభు యార్లగడ్డ - సుకుమార్‌ లను నామినేట్ చేసాడు. జక్కన్న ఛాలెంజ్‌ ని  స్వీకరించిన ఎన్టీఆర్ తన ఇంటి ఫ్లోర్‌ ని క్లీన్ చేసి.. పాత్రలు కడిగేసి.. ఇంటి పరిసరాలని శుభ్రం చేసేశాడు. ఆ తరువాత ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి - బాలయ్య - కింగ్ నాగ్ - వెంకీ మామలతో పాటు దర్శకుడు కొరటాల శివకు ఛాలెంజ్ విసిరాడు. ఇప్పటికే ఛాలెంజ్ యాక్సిప్టెడ్ అంటూ చిరంజీవి మరియు కొరటాల శివ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఇప్పుడు రామ్ చరణ్ కూడా ట్విట్టర్ ద్వారా 'బీ ద రియల్ మ్యాన్' వీడియోను అభిమానులతో పంచుకున్నారు. బట్టలు సర్దుతూ.. మాప్‌ తో ఫ్లోర్ క్లీన్ చేస్తూ.. మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు భార్య ఉపాసనకు కాఫీ పెట్టిచ్చారు. ఇంటి పనులు చేయడానికి గర్వపడదాం.. పని భారాన్ని పంచుకోవడం ద్వారా మహిళలకు సహాయం చేసి రియల్ మ్యాన్ అనిపించుకుందాం.. #BetheREALMAN అంటూ పోస్ట్ చేసాడు చరణ్. అంతేకాకుండా దర్శకుడు త్రివిక్రమ్ - బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ - రానా దగ్గుబాటి - శర్వానంద్ లను ఈ ‘బీ ద రియల్‌ మెన్‌’ ఛాలెంజ్‌ కు నామినేట్ చేశారు. ఇప్పటి దాకా టాలీవుడ్ కే పరిమితమైన ఈ ఛాలెంజ్ రామ్ చరణ్ ఏకంగా రణ్‌ వీర్ సింగ్ కి ఛాలెంజ్ విసిరి బాలీవుడ్ కి తీసుకెళ్లాడు. ఇప్పటికే రకరకాల ఛాలెంజెస్ తో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్న బాలీవుడ్ సెలెబ్రెటీలు ఇక ఊరుకుంటారా.. 'బీ ద రియల్ మ్యాన్' అంటూ రచ్చ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇళ్లలోని మహిళలను ఇలాంటి కష్టకాలంలో మరింత కష్టపెట్టలేరని.. ఇంటి పనులు చేస్తూ సహాయపడిన వారే నిజమైన మనుషులంటూ 'అర్జున్ రెడ్డి' సృష్టికర్త సందీప్ రెడ్డి సృష్టించిన ఈ ఛాలెంజ్ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలెబ్రెటీలు ఈ ఛాలెంజ్ ని విస్తృతంగా ముందుకి తీసుకెళ్తారు అనడంలో సందేహం లేదని చెప్పవచ్చు.


Full View
Tags:    

Similar News