చిరు బర్త్‌డేకి ఇంకో సర్‌ప్రైజ్

Update: 2015-07-16 05:57 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావిస్తుంటాడు. గత ఏడాది పుట్టిన రోజు నాడు తాను సినిమాల్లోకి పునరాగమనం చేయబోతున్నట్లు ప్రకటించి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తాడు చిరు. ఈ ఏడాది తన 150వ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదా ప్రారంభోత్సవం ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఐతే దీంతో పాటు మరో సర్‌ప్రైజ్ కూడా ఉంటుందని సమాచారం. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ కొత్త సినిమా టీజర్‌ను కూడా ఇదే రోజు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. ఈ మధ్య ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకువచ్చిన వైట్ల ప్రస్తుతం హైదరాబాద్‌లోనే షూటింగ్ చేస్తున్నాడు. చిరు పుట్టిన రోజు కానుకగా వచ్చే నెల టీజర్ కట్ చేసి అభిమానుల్ని అలరించాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. చరణ్ స్టంట్ మాస్టర్‌గా కనిపిస్తున్న ఈ సినిమా వైట్ల మార్కు యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. చరణ్ ఇప్పటిదాకా ఇలాంటి ఎంటర్టైనర్‌లో నటించలేదంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కృతి కర్బంద ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ముందుగా అన్నట్లే అక్టోబరులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత డీవీవీ దానయ్య తెలిపారు.
Tags:    

Similar News