'సైరా' వాయిదా లేదు.. ఖండించిన చ‌ర‌ణ్

Update: 2019-08-29 13:06 GMT
`సాహో` త‌ర్వాత అంతటి క్రేజీ ప్రాజెక్టుగా `సైరా: న‌ర‌సింహారెడ్డి` చిత్రాన్ని నిర్మిస్తున్నారు రామ్ చ‌ర‌ణ్. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బెస్ట్ గా ఉండాల‌నే ప‌ట్టుద‌ల‌తో చిరుత‌న‌యుడు ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి- రామ్ చ‌ర‌ణ్ బృందం ఈ భారీ హిస్టారిక‌ల్ వారియ‌ర్ సినిమా కోసం ఎంత‌గా శ్ర‌మిస్తున్నారో చూస్తున్న‌దే. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నుల్ని శ‌ర‌వేగంగా పూర్తి చేసేందుకు టీమ్ రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నారు. ఇంకో 20 శాతం వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ పూర్త‌యితే ఆల్మోస్ట్ అన్నిప‌నులు పూర్త‌యిన‌ట్టేన‌ని స‌మాచారం అందుతోంది. అక్టోబ‌ర్ 2 రిలీజ్ డెడ్ లైన్ కి తగ్గ‌ట్టే ప‌ని స‌జావుగానే సాగుతోంద‌ట‌.

అయితే స‌రిగ్గా రిలీజ్ ముంగిట ఉన్న‌ట్టుండి బాలీవుడ్ ట్రేడ్ లో ఉన్న‌ట్టుండి వాయిదా ప్ర‌చారం వేడెక్కించింది. హృతిక్ - టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన `వార్` చిత్రంతో పోటీ ప‌డ‌కుండా `సైరా`ను వాయిదా వేశార‌న్న‌దే ఆ ప్ర‌చారం సారాంశం. అక్టోబ‌ర్ 2న `వార్` య‌థాత‌థంగా రిలీజ‌వుతుంటే.. హిందీ డిస్ట్రిబ్యూట‌ర్ల అభ్య‌ర్థ‌న మేర‌కు `సైరా`ను వారం పాటు వాయిదా వేస్తూ అక్టోబ‌ర్ 8న రిలీజ్ చేస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే వాయిదా విష‌యాన్ని చ‌ర‌ణ్ కానీ హిందీ పంపిణీదారులు కానీ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అయితే వాయిదా ప్ర‌చారాన్ని ఒక నిర్మాత హోదాలో రామ్ చ‌ర‌ణ్ కానీ కొణిదెల కంపెనీ కానీ వెంట‌నే ఖండించ‌క‌పోవ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కూ స‌స్పెన్సె కొన‌సాగింది. దాదాపు 150-200 కోట్ల బ‌డ్జెట్ తో సైరా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అలాంటి క్రేజీ సినిమా వాయిదా అంటూ సాగిన ప్ర‌చారానికి చెక్ పెట్ట‌క‌పోవ‌డంతో సందేహించారు. ఉత్త‌రాదిన ప్ర‌ముఖ ట్రేడ్ ఎన‌లిస్ట్ ఈ ట్వీట్ చేసి డిలీట్ చేయ‌డంపై చ‌ర‌ణ్ స్పందించ‌లేదు.

అయితే ఎట్ట‌కేల‌కు వాయిదా ప్ర‌చారాన్ని చ‌ర‌ణ్ ఖండించారు. నేటి మ‌ధ్యాహ్నం  ఓ స్పెష‌ల్ జెట్ లో నెల్లూరు సూళ్లూరు పేట వెళ్లిన చ‌ర‌ణ్ అక్క‌డ ప్ర‌భాస్ వీఎపిక్ థియేట‌ర్ ని ప్రారంభించారు. అనంత‌రం మీడియా మీట్ లో  `సైరా` వాయిదా నిజ‌మా? అంటూ ఓ జ‌ర్న‌లిస్ట్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చ‌ర‌ణ్ పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. ``సైరా వాయిదా లేదు. అవ‌న్నీ రూమ‌ర్లు. చెప్పిన టైముకే వ‌చ్చేస్తున్నాం`` అంటూ తెలిపారు చ‌ర‌ణ్‌. దీంతో మెగాస్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబ‌ర్ 2న `సైరా-న‌ర‌సింహారెడ్డి` య‌థాత‌థంగా రిలీజ‌వుతోంది. సామాజిక మాధ్య‌మాల్లో (ట్విట్ట‌ర్- ఇన్ స్టాగ్ర‌మ్- ఎఫ్ బీ)నూ దీనిని చ‌ర‌ణ్ అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. మొత్తానికి వీఎపిక్ లాంచింగ్ ఈవెంట్లో క్లారిటీ వ‌చ్చేసింది.  తెలుగు-త‌మిళం- హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో సైరా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

    

Tags:    

Similar News