300 మందిని చంపినా కానీ...

Update: 2019-01-09 01:30 GMT
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `విన‌య విధేయ రామ‌` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నేడు చ‌ర‌ణ్ మీడియాతో ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ ఇంట‌ర్వ్యూలో శ‌రాల్లాంటి ప్ర‌శ్న‌లు చ‌ర‌ణ్ పై సంధించింది తెలుగు మీడియా. అందులో కొన్ని సెటైర్లు, పంచ్ లు ఉన్నాయి. వాట‌న్నిటికీ చెర్రీ ఎంతో ఓపిగ్గా స‌మాధానాలిచ్చారు. పంచ్ కి పంచ్ అన్న తీరుగా ఆయ‌న స‌మాధానాల్లో ఎంతో ఫ‌న్ ఆక‌ట్టుకుంది.

ఇప్ప‌టికే `విన‌య విధేయ రామ‌` ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత ఈ చిత్రంలో హింస పాళ్లు ఎక్కువే ఉంటుంద‌ని - బోయ‌పాటి మునుప‌టి సినిమాల్ని మించి  ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని స్థాయిలో భారీ యాక్ష‌న్‌ ని ఇన్ బిల్ట్ చేశార‌ని అర్థ‌మైంది. బోయపాటి మార్క్ మాస్ యాక్ష‌న్ ట్రీట్ ఉంటుంద‌ని అభిమానులు ఇప్ప‌టికే ఫిక్స‌యిపోయారు. చ‌ర‌ణ్ గ‌న్స్ చేత‌ప‌ట్టి భీభ‌త్స‌కాండ సృష్టించ‌డం పైనా వేడిగా చ‌ర్చ సాగుతోంది. ఇదే విష‌యంపై చ‌ర‌ణ్ కి ఓ ఆస‌క్తిక‌ర‌ ప్ర‌శ్న ఎదురైంది.

విధేయ రాముడు కనీసం మూడొందల మందిని చంపుతాడా..? అన్న ప్ర‌శ్న‌కు.. చ‌ర‌ణ్ సింపుల్ గా న‌వ్వేస్తూ `మగధీర`లో వంద మందిని చంపితే చూసారు క‌దా! మూడు వందల మందిని చంపితే చూడరా? అంటూ త‌న‌దైన శైలిలో రివ‌ర్శ్ పంచ్ వేశారు. బోయపాటి అన‌గానే హింస ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. కానీ `వినయ విధేయ రామ` చిత్రంలో హింస ఉండదు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ స‌న్నివేశాలు ఉన్నాయి. అన్ని వ‌ర్గాల వారిని మెప్పించే విధంగా స‌న్నివేశాలు  ఉంటాయి. హింస క‌థ‌నానికి ఎంత మాత్రం అడ్డంకి కాదు అని అన్నారు.  మూడొందల మందిని చంపారా అంటే..! వంద మందిని చంపినా... మూడొందల మందిని చంపినా కథ బాగుంటేనే ప్రేక్ష‌కులు చూస్తారు. క‌థ‌లో ఎగ్జిస్ట్ అయితే అలా చంప‌డం తప్పు కాదు అని రామ్ చరణ్ అన్నారు. ఇక బీహార్ మాఫియా నేప‌థ్యంలోని క‌థాంశం  కాబ‌ట్టి, శ‌త్రువు(ఒబెరాయ్‌) భీక‌ర‌మైన వాడు. అందుకే ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు క‌నీసం 600 మందిని అయినా చంపి ఉంటాడ‌ని మీడియాలో ఆస‌క్తిక‌రంగా చ‌ర్చ సాగింది. ట్రైల‌ర్ లో భీభ‌త్స‌కాండ చూశాక అలా ఫిక్స‌యిపోవాల్సిందేనని పంచ్ లు వేసుకున్నారు మీడియా జ‌నం. కుటుంబాన్ని కాపాడుకోవ‌డం కోస‌మే ఈ హింస అన్న‌ది బోయ‌పాటి పాయింట్ ఆఫ్ వ్యూ. మొత్తానికి మాస్ కి ఈ సంక్రాంతి పండ‌గ వేళ‌ ఫుల్ మీల్స్ లా చ‌ర‌ణ్ సినిమా అల‌రించ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది.




Tags:    

Similar News