ఎన్టీఆర్ స్టయిల్లోనే చరణ్ కూడా..

Update: 2018-10-17 11:34 GMT
మాస్ హీరోలు చొక్కా విప్పి బాడీ చూపిస్తూ ఫైట్లు చేస్తే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. కెరీర్లో ఏదో ఒక సినిమాలో హీరోలు ఇలా చొక్కా విప్పి బేర్ బాడీ చూపిస్తుంటారు. అందులోనూ గత కొన్నేళ్లలో సిక్స్ ప్యాక్స్.. చిజిల్ బాడీలు చూపించడం ఫ్యాషన్ గా మారింది కూడా. ఈ బాటలో ఒక్కో హీరో నడుస్తున్నాడు. ఇటీవలే ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్ ఇలాగే దర్శనమిచ్చాడు. సినిమా ఆరంభంలోనే వచ్చే యాక్షన్ ఎపిసోడ్లో సిక్స్ ప్యాక్ చూపించాడు. అభిమానులకు.. మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే రీతిలో ఆ యాక్షన్ ఘట్టాన్ని తీర్చిదిద్దాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. క్లాస్ డైరెక్టర్ గా పేరున్న త్రివిక్రమే హీరోను అలా ప్రెజెంట్ చేస్తే.. ఊర మాస్ దర్శకుడిగా పేరున్న బోయపాటి శ్రీను.. రామ్ చరణ్ లాంటి మాస్ హీరోను ఇంకెలా చూపిస్తాడో చెప్పేదేముంది?

బోయపాటి-చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా మాస్ కు విందు భోజనం లాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. చిత్ర బృందం నుంచి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో చరణ్ సైతం బేర్ బాడీతో కనిపించబోతున్నాడట. ‘ధృవ’ కోసం మంచి షేప్ లోకి వచ్చిన చరణ్.. ‘రంగస్థలం’లో పల్లెటూరి కుర్రాడిగా సహజంగా కనిపించడం కోసం కొంచెం తగ్గాడు. తర్వాత బోయపాటి సినిమా కోసం మళ్లీ బాడీ పెంచాడు. ‘ధృవ’ కన్నా ఇందులో అతను కండలు పెంచి కనిపిస్తాడని అంటున్నారు. ఆ బాడీని ఎలివేట్ చేస్తూ బోయపాటి ఒక యాక్షన్ ఘట్టాన్ని తీర్చిదిద్దాడట. ఈ ఎపిసోడ్ అంతా చరణ్ బేర్ బాడీతోనే ఉంటాడట. అతడి ఒంటిపై టాటూ కూడా ఉంటుందని.. అది కూడా ఒక ఉద్దేశాన్ని చాటేదే అని చెబుతున్నారు. ఈ చిత్రానికి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. విజయదశమి కానుకగా గురువారమే టైటిల్ ప్రకటించే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News