వర్మ ఇలా చేస్కుంటే బెటరేమో..

Update: 2018-09-02 17:30 GMT
రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ఎంత పతనం అయిపోయాడో ‘ఆఫీసర్’ సినిమాతో అందరికీ అర్థమైంది. అక్కినేని నాగార్జున లాంి పెద్ద హీరో నటించిన చిత్రానికి కోటి రూపాయల షేర్ కూడా రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడిగా వర్మ పతనంతో పాటు వ్యక్తిగత పతనం కూడా ఈ సినిమాకు ఇంత దారుణమైన ఫలితం రావడానికి కారణం అనడంలో సందేహం లేదు. వర్మ గతంలో ఎన్ని వివాదాలు రాజేసినా.. ఎవరిని ఎంత గిల్లినా చెల్లిపోయింది కానీ.. శ్రీరెడ్డితో పవన్ కళ్యాణ్‌ ను బూతు తిట్టించే విషయంలో మాత్రం బాగా డ్యామేజ్ అయిపోయాడు. జనాలు ఆయన్ని చీదరించుకునే పరిస్థితి వచ్చేసింది. అదే సమయంలో దర్శకుడిగా ఎలాంటి ప్రత్యేకతా చాటుకోకపోవడంతో ‘ఆఫీసర్’కు దారుణమైన ఫలితం వచ్చింది.

వర్మ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలపై జనాలకు పూర్తిగా నమ్మకం పోయిందన్న విషయం కూడా ‘ఆఫీసర్’తో రుజువైంది. అలాగని పూర్తిగా వర్మ పనైపోయిందని కూడా భావించలేం. అందుకు ‘భైరవ గీత’ రుజువుగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించాడు వర్మ. ఈ చిత్ర ట్రైలర్ చూస్తే మంచి కంటెంట్ ఉన్న సినిమాలాగే అనిపిస్తోంది. ఇందులో అడుగడుగునా వర్మ ముద్ర కనిపిస్తోంది. అలాగని వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లాగే స్టేల్ అయిపోయిన ఫీలింగ్ రావట్లేదు. సిద్దార్థ అనే కుర్రాడిలో స్పార్క్ గుర్తించి అతడితో ఈ చిత్రం ప్లాన్ చేసింది వర్మే. దీని కంటే ముందు అజయ్ భూపతి అనే టాలెంటెడ్ డైరెక్టర్ వర్మ స్కూల్ నుంచే వచ్చి ‘ఆర్ ఎక్స్ 100’తో సత్తా చాటుకున్నాడు టేకింగ్ విషయంలో అందులోనూ వర్మ ముద్ర కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వర్మ స్వీయ దర్శకత్వంలో సినిమాలు మానేసి.. ఇలాంటి స్పార్క్ ఉన్న శిష్యులతో సినిమాలు ప్లాన్ చేసుకుంటూ.. తన అనుభవాన్ని కూడా జోడిస్తే మంచి ఫలితాలు వచ్చేలా కనిపిస్తోంది. ఇకపై వర్మ ఇలాంటి వాటికే పరిమితం అయిపోతే బెటరేమో.

Tags:    

Similar News