10 ఏళ్ల‌లో '0' హిట్స్ ఇచ్చిన ఏకైక స్టార్ హీరోయిన్

జాతీయ అవార్డులతో రియ‌ల్ క్వీన్ గా ఓ వెలుగు వెలిగిన కంగ‌న‌ గత వైభవం ఏమైంది? అంటూ అభిమానులే ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Update: 2025-01-24 10:30 GMT

కంగన రనౌత్ ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద క్వీన్ అని నిరూపించింది. కెరీర్‌లో చారిత్రాత్మక విజయాలను అందించింది. నోటి మాట‌తో ఎటాక్ చేయ‌డంలోనే కాదు.. విజ‌యంతోను త‌న దూకుడుకు ఎదురే లేద‌ని నిరూపించింది. కానీ గ‌డిచిన ఈ ప‌దేళ్లు ఏమైందో ఏమో కానీ త‌న ప్ర‌భ పూర్తిగా మ‌స‌క‌బారింది. స‌క్సెస్ శాతం అంత‌కంత‌కు దిగ‌జారి ఇప్ప‌టికే జీరోకి చేరుకుంది. ప్రతిభ పరంగా గత దశాబ్దంలో ఏదీ మారలేదు. కానీ బాక్సాఫీస్ విషయానికి వస్తే కంగ‌న‌ స్థాయి పూర్తిగా దిగ‌జారిపోయింది.

జాతీయ అవార్డులతో రియ‌ల్ క్వీన్ గా ఓ వెలుగు వెలిగిన కంగ‌న‌ గత వైభవం ఏమైంది? అంటూ అభిమానులే ఆశ్చ‌ర్య‌పోతున్నారు. దాదాపు ఒక దశాబ్దం పాటు బాక్సాఫీస్ విజ‌యం కంగనను వెక్కిరించింది. ఇటీవల విడుదలైన ఎమర్జెన్సీ కూడా ఈ ట్రెండ్‌ను కొన‌సాగించింది. మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ పాత్ర‌లో కంగ‌న అద్భుతంగా న‌టించింద‌ని ప్ర‌శంస‌లు కురిసినా కానీ, ఎందుక‌నో ఎమ‌ర్జెన్సీ బాక్సాఫీస్ వ‌ద్ద రాణించ‌డంలో త‌డ‌బ‌డింది. పెట్టిన పెట్టుబ‌డుల‌కు త‌గ్గ వ‌సూళ్ల‌ను సాధించ‌డంలో పూర్తిగా నీర‌సప‌డిపోయింది. దీంతో 10 ఏళ్ల‌లో `0` హిట్స్ ఇచ్చిన ఏకైక స్టార్ హీరోయిన్ గా కంగ‌న రికార్డుల‌కెక్కింది.

నిజానికి క్వీన్ కెరీర్ 2011 నుంచి 2015 వరకు ధేధీప్య‌మానంగా వెలిగింది. అస‌లు త‌న సినిమాల్లో అగ్ర హీరోల‌కు అవ‌కాశ‌మే లేకుండా చేయ‌గ‌లిగింది. కంగన క‌నిపిస్తే చాలు బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్టు ద‌క్కేది. కానీ ఇప్పుడు ఆ స‌న్నివేశం పూర్తిగా జీరో అయిపోయింది. క్వీన్, తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ లాంటి రికార్డ్ బ్రేకింగ్ హిట్లు కేవ‌లం కంగ‌న ఛ‌రిష్మాతోనే సాధ్య‌మ‌య్యాయి. మూడుసార్లు అత్యధిక వసూళ్లు సాధించిన మ‌హిళాన‌టిగా కంగ‌న రికార్డుల‌కెక్కింది. అంతకు ముందు ఆ త‌ర్వాత మరే ఇతర స్టార్ ఇలాంటి ఘ‌న‌త‌ను సాధించ‌లేదు. కానీ త‌న అత్యున్న‌త స్థానాన్ని నిల‌బెట్టుకోవ‌డంలో కంగ‌న ఘోరంగా విఫ‌ల‌మైంది. 28 ఏళ్ల వయసులో కంగ‌న సాధించిన ఆ విజ‌యాల‌ను రిపీట్ చేయ‌లేక చ‌తికిల‌బ‌డింది. కంగ‌న ట్రేడ్ వ‌ర్గాల్లో బ‌లంగా మారాలని ఆశించారు. కానీ దురదృష్టం త‌న‌ను నీడ‌లాగా వెంటాడింది. చెత్త‌ ఎంపికలకు తోడు, వివాదాలు త‌న‌ను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసాయి. ప‌రిశ్ర‌మ మొత్తం త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌డం కూడా ఈ ప‌రాజ‌యాల‌కు స‌హ‌క‌రించింది.

గత ప‌దేళ్ల‌లో కంగనా రనౌత్ సినిమాలను ప‌రిశీలిస్తే... తను వెడ్స్ మను రిటర్న్స్ విజయం తర్వాత కంగనా 11 చిత్రాలలో నటించింది. ఈ వారం విడుదలైన `ఎమర్జెన్సీ`ని క‌లుపుకుని ప్ర‌తిదీ ఫ్లాప్ గానే మిగిలాయి. తేజస్, ధాకడ్ లాంటి భారీ బ‌డ్జెట్ చిత్రాలు అతితక్కువ కలెక్షన్ల కారణంగా డిజాస్టర్లుగా మారాయి. గత 10 సంవత్సరాలలో చెప్పుకోద‌గ్గ వ‌సూళ్ల‌ను సాధించిన‌ది ఒక్క మ‌ణిక‌ర్ణిక మాత్ర‌మే. రాణి లక్ష్మీబాయి బయోపిక్ భారతదేశంలో రూ.93 కోట్ల నికర వసూళ్లను సాధించ‌గా, ప్రపంచవ్యాప్తంగా రూ.134 కోట్లను వ‌సూలు చేసింది. ఇది అదుపు త‌ప్పిన బ‌డ్జెట్ కార‌ణంగా క్లీన్ హిట్ కాలేదు. కానీ యావ‌రేజ్ గా నిలిచింది. కోవిడ్ తర్వాత కంగ‌న‌కు అస‌లు క‌లిసి రాలేదు. విజ‌యం అన్న‌దే లేదు. ఎమర్జెన్సీకి ముందు చివరి మూడు చిత్రాలు - తేజస్, ధాకడ్, తలైవి - అన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాలు అయ్యాయి. ఈ మూడు చిత్రాల బడ్జెట్ కలిపి 255 కోట్లు. కానీ మూడింటి వ‌సూళ్లు క‌లుపుకుని 17 కోట్లు మాత్ర‌మే రాబ‌ట్టాయి. 85 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన యాక్షన్ చిత్రం ధాకడ్, ప్రపంచవ్యాప్తంగా రూ.3 కోట్లు మాత్రమే సంపాదించి అన్నింటికంటే చెత్త సినిమాగా రికార్డుల‌కెక్కింది.

ఎమర్జెన్సీ పై చాలా ఆశ‌లు పెట్టుకున్నా మొదటి ఆరు రోజుల్లో కేవ‌లం రూ.15 కోట్ల వ‌సూళ్ల‌కు చేరుకోవడంలో ఇబ్బంది పడుతోంది. ఈ చిత్రాన్ని 60 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించ‌గా, డిజాస్ట‌ర్ దిశ‌గా వెళుతోంది. త‌న సినిమాకి ప్ర‌చారం ప‌రంగా హైప్ లేదు. రిలీజ్ ముందు క‌ష్టాలు క‌న్నీళ్ల గురించి తెలిసిందే. ఎమ‌ర్జెన్సీ కోసం సొంత అపార్ట్ మెంట్లు అమ్ముకుని మ‌రీ కంగ‌న పెట్టుబ‌డులు పెట్టింది. కానీ ఫలితం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ప‌దేళ్ల‌లో సున్నా విజ‌యాలను అందుకున్న ఏకైక క్వీన్ గా కంగ‌న మిగిలిపోయింది.

Tags:    

Similar News