వర్మ సినిమా.. వాయిదాల పర్వం

Update: 2018-10-24 10:19 GMT
‘ఆఫీసర్’ సినిమాతో దిమ్మదిరిగాక రామ్ గోపాల్ వర్మ కొన్నాళ్ల పాటు సైలెంటుగా ఉన్నాడు. ఆ గ్యాప్ తర్వాత తన నిర్మాణంలో తెరకెక్కిన ‘భైరవ గీత’ను జనాల ముందుకు తెచ్చాడు. ఈ సినిమా గురించి ఆహా ఓహో అని చెబుతూ.. వరుస బెట్టి పోస్టర్లు.. ట్రైలర్.. ఇంకా కొన్ని ప్రోమోలు వదిలి హడావుడి చేసిన వర్మ.. విడుదల సంగతి మాత్రం తేల్చలేకపోయాడు. ముందుగా ‘భైరవ గీత’ను ‘అరవింద సమేత’కు పోటీగా అక్టోబరు 12న రిలీజ్ చేయడానికి డిసైడయ్యాడు. అప్పట్లో రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వేశారు. అది చూసి వర్మ చాలా ధైర్యవంతుడని అనుకున్నారు. కానీ ఆ ధైర్యం ప్రకటనలకే పరిమితం అయింది. 12న ఈ చిత్రం విడుదల కాలేదు. ఆ తర్వాత అక్టోబరు 26న విడుదల అంటూ కొత్త పోస్టర్లు వదిలారు. ‘అరవింద సమేత’కు భయపడి 26కు వాయిదా వేశారంటే ఓకే అనుకోవచ్చు.

కానీ ఇప్పుడు అక్టోబరు 26న కూడా సినిమా విడుదల కావట్లేదు. కారణాలేంటన్నది తెలియదు. ఈలోపు కొత్త రిలీజ్ డేట్‌తో పోస్టర్లు రిలీజయ్యాయి. నవంబరు 22న ‘భైరవ గీత’ను ప్రేక్షకుల ముందుకుతెస్తారట. మరి నవంబరు 22న అయినా సినిమా పక్కాగా వస్తుందో రాదో చూడాలి. కన్నడ-తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీ.. తమిళంలోనూ రిలీజ్ చేయాలని వర్మ భావిస్తున్నాడు. ‘రక్త చరిత్ర’ స్టయిల్లో కనిపిస్తున్న ఈ చిత్రాన్ని సిద్దార్థ అనే కన్నడ యువ దర్శకుడు రూపొందించాడు. ధనంజయ-ఐరా అనే కొత్త హీరో హీరోయిన్లు ఇందులో జంటగా నటించారు. వాళ్లిద్దరి మధ్య ఇంటిమేట్ రొమాన్స్‌‌ ను హైలైట్ చేస్తూ పోస్టర్లు రిలీజ్ చేస్తూ వస్తున్నాడు వర్మ. ఈ చిత్ర ట్రైలర్ చూస్తే.. ‘రక్తచరిత్ర’ ఛాయలు కనిపించాయి. టేకింగ్‌లో ఈ దర్శకుడికి వర్మ స్ఫూర్తి చాలానే ఉన్నట్లుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


Tags:    

Similar News