‘వంగవీటి’.. వంగవీటి సినిమా కాదు

Update: 2016-01-09 09:30 GMT
వంగవీటి అని పేరు పెట్టుకుని మళ్లీ వంగవీటి మీద సినిమా కాకపోవడమేంటి.. అంటారా? రామ్ గోపాల్ వర్మ అదే అంటున్నాడు. పేరు అలా పెట్టినంత మాత్రాన తాను తీయబోయేది వంగవీటి ఫ్యామిలీ గురించి మాత్రమే అని పొరబడవద్దని వర్మ చెబుతున్నాడు. విజయవాడ రౌడీ రాజకీయం అనగానే అందరికీ వంగవీటి ఫ్యామిలీనే గుర్తుకొస్తుందని.. అందుకే ఆ పేరు పెట్టానని, అంతే తప్ప తాను వాళ్ల గురించి మాత్రమే సినిమా తీయబోనని.. చలసాని వెంకటరత్నంను వంగవీటి రాధా హత్య చేయడం దగ్గర్నుంచి వంగవీటి రంగా హత్య వరకు జరిగిన పరిణామాల్ని తన సినిమాలో చూపిస్తానని వెల్లడించాడు.

తన సినిమాలో ఎవరూ హీరోలు - విలన్లు ఉండరని.. అన్నీ పరిస్థితులు - పాత్రలు మాత్రమేనని వర్మ చెప్పాడు. తాను సినిమాలో ఏ వర్గం వైపు ఉండనని.. ఎవరి పక్షం తీసుకోనని.. రాజకీయ ఉద్దేశాలు కూడా ఆపాదించనని.. కులాల గురించి చర్చించనని.. కానీ ఎవరో ఏదో అనుకుంటారని, ఏమో అవుతుందని వాస్తవాలు మాత్రం దాచనని వర్మ చెప్పాడు. ఎవరికో భయపడుతూ బతకడం కంటే చావడం మేలని.. అందుకే తాను అనుకున్నది తాను తీస్తానని వర్మ చెప్పాడు. రౌడీయిజంతో ముడిపడ్డ సినిమా కాబట్టి తన సినిమాలో వయొలెన్స్ ఎక్కువ ఉంటుందని.. హార్డ్ హిట్టింగ్ గానూ ఉంటుందని వర్మ తెలిపాడు. రంగాను చంపింది ఎవరు అని తాను చూపించనని.. ఐతే ఫలానా వాళ్లు అయి ఉండొచ్చేమో అన్న డైలాగ్ పెడితే పెట్టొచ్చని అన్నాడు. సినిమా ఎప్పుడు మొదలువుతుంది.. ఎప్పుడు పూర్తి చేస్తాను అన్నది చెప్పలేనని.. కానీ సినిమా మాత్రం తీసి తీరుతానని వర్మ స్పష్టం చేశాడు.
Tags:    

Similar News