బాలయ్యకే అంకితం ఇచ్చిన వర్మ

Update: 2019-03-09 04:08 GMT
అదేదో సామెత చెప్పినట్టు ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం పట్ల బాలకృష్ణ ఇప్పటికీ మూడ్ ఆఫ్ నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉండగా గాయం మీద కారం చల్లినట్టు రామ్ గోపాల్ వర్మ నిన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అన్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తన ప్రసంగం ప్రారంభంలో ఈ చిత్రం తీయడానికి గల స్ఫూర్తి అంటూ కాసెపు ఊరించి పేరు చెప్పకుండా నాన్చిన వర్మ స్వర్గీయ ఎన్టీఆర్ అంటారేమో అనుకుంటే అనూహ్యంగా నందమూరి బాలకృష్ణ అని చెప్పడం మీడియా సైతం ఊహించనిది.

సాధారణంగా ఎవరి మీదైతే సినిమా తీశాడో వాళ్ళకు నివాళిగా అంకితం ఇవ్వడం సహజం. అసలు తన పొడంటేనే గిట్టని బాలకృష్ణకు ఏకంగా లక్ష్మిస్ ఎన్టీఆర్ అంకితం అని వర్మ చెప్పడం కొత్త ట్విస్ట్. బాలయ్యను ఇంతకు ముందు కలిసినప్పుడే లక్ష్మీస్ ఎన్టీఆర్ తీయలన్న ఆలోచన వచ్చిందన్న వర్మ సాధ్యమైనంత మేర నిజాలే చూపించానని పదే పదే చెప్పుకోవడం గమనార్హం

ఈ సంఘటనలు జరిగిన కాలంలో రంగీలా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ప్రత్యక్ష అవగాహన లేకపోయినా సమాచార సేకరణతో పాటు అప్పటి పరిణామాలకు  సాక్షులుగా ఉన్న మీడియా మిత్రులు రాజకీయ నాయకులు తదితరులు ఇచ్చిన సమాచారాన్ని తీసుకుని వాస్తవాలకు అతి దగ్గరగా ఇది తీశానని చెప్పుకొచ్చాడు.

ఇదంతా బాగానే ఉంది కాని అసలు ఏ సంబంధం లేని బాలయ్యకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని అంకితం ఇవ్వడంలో పరమార్థం ఎవరిని వారు అర్థం చేసుకోవాల్సిందే. కాలం చేసిన  హరికృష్ణకు కాని ఎన్టీఆర్ గారి కూతుళ్ళకు గాని ఎవరిదాకో ఎందుకు వెనుక అండదండలు అందించిన స్వయానా ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మి పార్వతికి గాని అంకితం ఇవ్వకుండా బాలయ్యనే టార్గెట్ చేయడం ఎందుకో వేరే చెప్పాలా
    

Tags:    

Similar News