ఇంకో పది ఐస్ క్రీమ్ లు వచ్చినా తరగని క్రేజ్

Update: 2016-02-27 17:30 GMT
రామ్ గోపాల్ వర్మ నికార్సైన హిట్ కొట్టి దాదాపు ఐదేళ్ళు అవుతుంది. మధ్యలో వచ్చి 'పోయిన' సినిమాలు కోకొల్లలు. ఎటాక్స్ ఆఫ్ ముంబై, కిల్లింగ్ వీరప్పన్ పాత రామూని జ్ఞప్తికి తెచ్చాయేగానీ మరిపించలేకపోయాయి. వర్మ పనైపోయిందని ప్రతీ ఒక్కరూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినవారే.

అయితే రెండు కాదు మరో పది ఐస్ క్రీమ్ వంటి చెత్త సినిమాలు తీసినా వర్మ క్రేజ్ ఏ మాత్రం తరగదని విజయవాడలో రుజువయ్యింది. కార్లు, బండ్లతో కాన్వాయ్ గా వర్మకు స్వాగతం పలికారు అక్కడి అభిమానులు. తెలుగులో తన చివరి చిత్రంగా అభివర్ణింపబడుతున్న వంగవీటి కధా చర్చల కోసం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగిన రామూకి అభిమానులు బ్రహ్మరధం పట్టడం విశేషం.

సాధారణంగా హీరోలకి, పొలిటికల్ లీడర్లకు వుండే హంగామా, కటౌట్ ల సరంజామా, పూల స్వాగతాలు ఒక డైరెక్టర్ కి, అదీ ఫ్లాపుల ఊబిలొ కూరుకుపోయిన డైరెక్టర్ కి లభించడం నిజంగా రామూకున్న క్రేజ్ అనే చెప్పాలి. కాదంటారా
Tags:    

Similar News