400కార్ల కాన్వాయ్‌ తో వ‌ర్మ‌కి స్వాగ‌తం

Update: 2016-02-26 14:12 GMT
రామ్‌ గోపాల్ వ‌ర్మకి త‌న విజ‌య‌వాడ ఫ్యాన్స్ క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో స్వాగ‌తం ప‌లికారు. స్టార్ హీరోల‌కి, ముఖ్య‌మంత్రుల‌కి కూడా లేని విధంగా ఏకంగా 400 కార్లు, వెయ్యి బైకుల‌తో కూడిన కాన్వాయ్ మ‌ధ్య వ‌ర్మ‌ని గ‌న్న‌వ‌రం నుంచి విజ‌య‌వాడ‌కి తీసుకెళ్లారు. ఒక ద‌ర్శ‌కుడికి ఇంత గ్రాండ్‌, ఇంత రాయ‌ల్‌ గా వెల్ క‌మ్ ద‌క్క‌డం భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి అని వ‌ర్మ ఫ్యాన్స్ చెప్పుకొంటున్నారు. వంగ‌వీటి చిత్రం కోసం రామ్‌గోపాల్ వ‌ర్మ విజ‌య‌వాడ‌లో అడుగుపెట్టారు. ఆయ‌న పుట్టి పెరిగింది అక్క‌డే.

విజ‌య‌వాడ రౌడీయిజాన్ని చాలా ద‌గ్గ‌ర్నుంచి చూసిన వ్య‌క్తి రామ్‌ గోపాల్ వ‌ర్మ‌. అందుకే వంగ‌వీటి కుటుంబానికీ, దేవినేని కుటుంబానికీ మ‌ధ్య సాగిన వార్ నేప‌థ్యంలో వంగ‌వీటి పేరుతో సినిమా తీయాల‌నుకొన్నాడు. గ్రాండ్‌ గా ఆ సినిమాని తెర‌కెక్కించి ఇక చిత్ర ప‌రిశ్ర‌మ‌కి దూరం కావాల‌నేది ఆయ‌న ఆలోచ‌న‌. అయితే వంగవీటి ఫ్యాన్స్‌ కి మాత్రం ఆ సినిమా తీయ‌డం ఇష్టం లేదు. దీంతో రామ్‌ గోపాల్ వ‌ర్మ‌కి రంగా ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు వెళ్లాయి. అయినా భ‌య‌ప‌డ‌ని వ‌ర్మ తాను రౌడీల‌కు రౌడీన‌ని, ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేద‌ని ఫ్లైట్ నెంబ‌ర్‌, తాను బ‌స చేసే హోట‌ల్ పేరు చెప్పి మ‌రీ విజ‌య‌వాడ బ‌య‌ల్దేరాడు. శుక్ర‌వారం ఐదు గంట‌ల‌క‌ల్లా గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకొన్నారు. అక్క‌డికి వెళ్ల‌గానే అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. పోలీసులూ గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాట్లు చేశారు. వ‌ర్మ రాక‌ని పుర‌స్క‌రించుకొని విజ‌య‌వాడ ఫ్యాన్స్ పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారు. వ‌ర్మ విజ‌య‌వాడ‌లో మూడు రోజులు  గ‌డ‌ప‌బోతున్నారు. ఈ మూడు రోజుల్లో అక్క‌డ వ‌ర్మ ఎవ‌రెవ‌రిని క‌లుస్తాడు? ఏం జ‌రబోతోంది? అనే విష‌యాలు  ఆస‌క్తిక‌రంగా మారాయి.
Tags:    

Similar News