వర్మ లాజిక్ మిస్ అవుతున్నాడు!

Update: 2018-11-26 11:02 GMT
వివాదాలతో తప్ప సినిమాలో విషయంతో మెప్పించే అలవాటు తప్పిపోయిన రామ్ గోపాల్ వర్మ తన నిర్మాణంలో వస్తున్న కొత్త సినిమా భైరవ గీత మీద ప్రచారం బాగానే చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఏకంగా 2.0తో పోలిక పెట్టేసుకుని అది పిల్లల సినిమా మాది పెద్దల సినిమా అంటూ కామెడీ చేయడం మీద ట్రాలింగ్ కూడా జరిగిపోయింది. ఇక దీని ప్రీ రిలీజ్ లో మాట్లాడిన వర్మ కొన్ని విషయాలు నిజాయితీగా మాట్లాడినప్పటికీ లాజిక్స్ మాత్రం మిస్ అయ్యాడనే చెప్పాలి. భైరవగీత సిద్ధార్థ అనే కుర్రాడు తీసిన మూవీ. పాతికేళ్ళు దాటని వయసులో మంచి అవుట్ ఫుట్ ఇచ్చినట్టు ఉన్నాడని ట్రైలర్ ని బట్టి అర్థమయ్యింది.

అయితే వర్మ మాత్రం అధోగతి పట్టి పాతాళంలో ఉన్న తనను పైకి తీసుకురావడానికి భైరవ గీత నాకు చేయి అందిస్తుందని చెప్పాడు. అయినా వర్మ పాతాళంలోకి కూరుకుపోయింది నిర్మాతగా కాదుగా. ఇప్పటికే దర్శకుడిగా తనను తాను ఎన్నో మెట్లు స్థాయి తగ్గించుకున్నాడు. మరి భైరవగీత హిట్ అయితే అది సిద్దార్థ ఘనత అవుతుంది కానీ దర్శకుడిగా ఆయనే చెప్పుకున్నట్టు పాతాళంలో ఉన్న వర్మను ఇదెలా పైకి తీసుకొచ్చినట్టు అవుతుంది. అయినా సక్సెస్ దర్శకుడి ఖాతాలోకి వెళ్తుంది. డబ్బు నిర్మాతకు చేరుతుంది. ఇది ఏ సినిమాకైనా వర్తించే బిజినెస్ లెక్క.

వర్మ తనను ఆర్థికంగా భైరవగీత పైకి తీసుకొస్తుంది అనే చెబుతున్నాడా లేక వర్మ అనే బ్రాండ్ తిరిగి సమకూరుతుంది అనే నమ్మకంతో అంటున్నాడో కానీ మొత్తానికి వర్మ స్పీచ్ మీద చాలా కామెంట్స్ వచ్చాయి. 2.0 వచ్చిన మరుసటి రోజే భైరవగీతను తీసుకొస్తూ వర్మ పెద్ద సాహసమే చేస్తున్నాడు. మాటల్లో ఉన్న కాన్ఫిడెన్స్ సినిమాలో ఉండదని అప్పుడెప్పుడో ఆగ్ నుంచి మొన్న ఆఫీసర్ దాకా రుజువవుతూనే ఉంది. భైరవ గీత దర్శకుడు వర్మ కాదు కాబట్టి నమ్మొచ్చేమో.
    

Tags:    

Similar News