మూడు భాగాలుగా న‌యీమ్ నేర‌చ‌రిత్ర‌

Update: 2016-08-23 06:12 GMT
న‌యీమ్ సినిమాకి సంబంధించి ఇంకా వ‌ర్మ నుంచి ప్ర‌క‌ట‌న రాలేదేంటా అనుకొంటున్నారు సినీ జ‌నాలు - ప్రేక్ష‌కులు.  అంత‌లోనే ఆయ‌న ట్విట్ట‌ర్ మోగింది. న‌యీమ్ నేర‌చరిత్ర‌ని సినిమాగా తీయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు వ‌ర్మ‌. మూడు భాగాలుగా ఆ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలిపాడు. న‌యీమ్ చ‌రిత్ర‌ని తెలుసుకొన్నాక ఒక సినిమాలో అంతా చెప్ప‌డం అసాధ్య‌మ‌నిపించింద‌ని అందుకే మూడు భాగాలుగా తీయాల‌ని నిర్ణ‌యించుకొన్న‌ట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశాడు. నిజ జీవిత గాథ‌ల‌తో సినిమాలు చేయ‌డంలో వ‌ర్మ‌ని మించిన‌వాళ్లు మ‌రొక‌రు ఉండరేమో.  ఆ క‌థ‌ల‌కి  క్రైమ్ నేప‌థ్యం కూడా ఉందంటే ఇక వ‌ర్మ‌కి మ‌రింత  ఉత్సాహం క‌లుగుతుంటుంది.

ఇప్ప‌టికే ముంబై మాఫియా మొద‌లుకొని అనంత‌పురం ఫ్యాక్ష‌నిజం వ‌ర‌కు ప‌లు నిజ జీవిత సంఘ‌ట‌న‌ల్ని సినిమాలుగా తెర‌కెక్కించాడు. గ‌త రెండు మూడు వారాలుగా రోజూ వార్త‌ల్లో క‌నిపిస్తున్న గ్యాంగ్ స్ట‌ర్ న‌యీమ్ చ‌రిత్ర సాధార‌ణ జ‌నాన్ని భ‌య‌భ్రాంతుల‌కి గురిచేస్తోంది. వ‌ర్మ‌కి కావ‌ల్సింది కూడా అలాంటి క‌థ‌లే. అందుకే న‌యీమ్ చ‌రిత్ర‌ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు ట్వీటాడు. న‌యీమ్ నేర చరిత్ర‌కి సంబంధించిన విష‌యాల్ని తెప్పించుకొన్నాన‌ని, అవ‌న్నీ తెలుసుకొంటుంటే రోమాలు నిక్క‌బొడుచుకొంటున్నాయ‌ని వ‌ర్మ ట్విట్ట‌ర్‌ లో చెప్పుకొచ్చాడు. ఒక న‌క్స‌లైట్‌ గా ప్ర‌యాణం మొద‌లుపెట్టి ఆ త‌ర్వాత పోలీసు ఇన్ఫార్మ‌ర్‌ గా - గ్యాంగ్‌ స్ట‌ర్‌ గా మారిన వైనం చాలా సంక్లిష్టంగా ఉంద‌ని, అందుకే ఆ చిత్రాన్ని మూడు భాగాలుగా తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశాడు.
Tags:    

Similar News