'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' మ‌రో ట్విస్టు

Update: 2019-04-10 17:16 GMT
వివాదాల ఆర్జీవీ తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` నైజాం స‌హా ఓవ‌ర్సీస్ లో రిలీజైన సంగ‌తి తెలిసిందే. తెలుగు దేశం పార్టీకి ప్ర‌తికూలంగా.. ఏపీ సీఎం చంద్ర‌బాబును ఈ చిత్రంలో విల‌న్ గా చూపించార‌ని .. అది ఏపీ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని తెలుగు దేశం పార్టీ నాయ‌కులు ఆరోపిస్తూ పిల్ దాఖ‌లు చేశారు. ఎల‌క్ష‌న్ కోడ్ అమ‌ల్లో ఉన్నందున సినిమా రిలీజ్ ని ఆపాల‌ని కోర్టులో వాదన‌లు వినిపించారు. ఈసీ అనుమ‌తించ‌క‌పోవ‌డంతో రిలీజ్ ప‌రంగా చిక్కులు తెచ్చింది. కార‌ణం ఏదైనా ఆ మేర‌కు ఆర్జీవీ అండ్ టీమ్ కి పంచ్ ప‌డిపోయింది. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వినిపించింది. వ‌సూళ్ల ప‌రంగానూ ఫ‌ర్వాలేద‌నిపించింది. ఆ క్ర‌మంలోనే ఏపీలో రిలీజ్ చేయ‌లేక‌పోయినందుకు టీమ్ క‌ల‌త‌కు గురైంది.

ఇప్ప‌టికీ ఈ సినిమా రిలీజ్ కి అడ్డంకులు తొల‌గిపోలేదు. కోర్టుల ప‌రిధిలో దీనిపై విచార‌ణ సాగుతోంది. అయితే కోర్టు విచార‌ణ పూర్త‌యితే.. ఏపీలో ఈనెల 11న ఎన్నిక‌లు అయిపోగానే రిలీజ్ చేసుకోవ‌చ్చ‌ని భావించారు. అయితే ఇంత‌లోనే మ‌రో ట్విస్టు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. అమరావతి హైకోర్టు లో ఈ సినిమాని న్యాయ‌మూర్తులు వీక్షించార‌ని తెలిసింది.   ప్ర‌స్తుతానికి తీర్పును సోమవారం నాటికి వాయిదా వేశారు. ఈనెల 12న‌ విడుదల లేదు. రిలీజ్ కోసం 19 వ‌ర‌కూ వేచి చూడాల్సిందేన‌ని తెలుస్తోంది.

కేసు పూర్వాప‌రాలు ప‌రిశీలిస్తే .. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని  మార్చి 29న తెలంగాణ‌తో పాటు ఏపీలోనూ విడుద‌ల చేసేందుకు ఆర్జీవీ టీమ్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించింది. చివ‌రి నిమిషంలో రిలీజ్ ని స‌వాల్ చేస్తూ పిల్ వేయ‌డంతో కోర్టుల ప‌రిధిలోకి వెళ్లింది గొడ‌వ‌. ర‌క‌ర‌కాల పిటిషన్లను జస్టిస్‌ ఏవీ శేషసాయి - జస్టిస్‌ యు. దుర్గా ప్రసాదరావులతో కూడిన ధర్మాసనం గత నెల 28న విచారించింది. సినిమాను తమ ముందు ప్రదర్శించాలని ధర్మాసనం ఆదేశించింది. ఆ ప్ర‌కార‌మే నేడు(బుధ‌వారం) న్యాయమూర్తుల చాంబర్ లో సినిమాని ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌స్తుతం మ‌రోసారి వాయిదా వేయ‌డంతో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ టీమ్ కి తీవ్ర‌ నిరాశ త‌ప్ప‌లేదు.
Tags:    

Similar News