'అధికారం ఇచ్చింది మా నెత్తినెక్కి కూర్చోడానికి కాదు'

Update: 2022-01-04 06:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పేదలకు సినీ వినోదాన్ని అందుబాటులో ఉంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతుంటే.. ఈ రేట్లతో నష్టాలు తప్పవని సినీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఓవైపు హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. మరోవైపు ధరల పరిశీలనకు ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. అయినప్పటికీ ప్రభుత్వానికి సినీ ప్రముఖులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

సినిమా టికెట్ ధరల అంశం మీద త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో.. ఈ వ్యవహారంలోకి ఇప్పుడు విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలుగజేసుకున్నారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా ఏపీ ప్రభుత్వాన్ని మరియు సినిమాటోగ్రఫి మినిస్టర్ పేర్ని నాని ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో వర్మ - నాని ల మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఏ విషయాన్నీ అంత ఈజీగా వదలని రామ్ గోపాల్ వర్మ.. మంగళవారం ఉదయం ఈ మేరకు వరుస ట్వీట్లతో ఏపీ ప్రభుత్వం మీద ప్రశ్నలు సంధించారు. 'గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సార్' అంటూనే సవాలు విసిరాడు. 'నేను అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వవలసిందిగా మిమ్మల్ని లేదా మీ ప్రతినిధులను సవినయంగా అభ్యర్థిస్తున్నాను' అంటూ కౌంటర్లు వేసే ప్రయత్నం చేసారు వర్మ.

''సినిమాలతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఏమిటి? గోధుమలు, బియ్యం, కిరోసిన్ నూనె మొదలైన నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని సమతౌల్యత కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ ధరను నిర్ణయించవచ్చని నేను అర్థం చేసుకున్నాను.. అయితే అది సినిమాలకు ఎలా వర్తిస్తుంది?'' అని వర్మ ప్రశ్నించారు.

''ఆహార ధాన్యాలలో కూడా బలవంతంగా ధర తగ్గించడం వల్ల రైతులు ప్రోత్సాహాన్ని కోల్పోతారు.. తద్వారా కొరత ఏర్పడి నాణ్యత లోపిస్తుంది. అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుంది. పేదలకు సినిమా చాలా అవసరం అని మీకు అనిపిస్తే.. వైద్య మరియు విద్యా సేవలకు ఎలా చేస్తున్నారో ప్రభుత్వం ఎందుకు సబ్సిడీ ఇవ్వదు?. పేదలకు మేలు చేయడానికి బియ్యం, పంచదార మొదలైన వాటిని అందించడానికి రేషన్ షాపులు సృష్టించినట్లు.., మీరు రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా?'' అని ఆర్జీవీ ట్వీట్ చేసారు.

''నిర్ధిష్ట పరిస్థితుల్లో సమతౌల్యం కంటే దిగువన లేదా అంతకంటే ఎక్కువ ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుత సినిమా పరిశ్రమలో మీరు ఏ ప్రత్యేక పరిస్థితిని గుర్తించారు? ద్వంద్వ ధరల వ్యవస్థ సిద్ధాంతంలో పరిష్కారం ఉంటుంది.. ఇక్కడ నిర్మాతలు వారి ధరకు టిక్కెట్లను అమ్మవచ్చు మరియు ప్రభుత్వం కొన్ని టిక్కెట్లను కొనుగోలు చేసి పేదలకు తక్కువ ధరలకు అమ్మవచ్చు.. తద్వారా మేము మా డబ్బును పొందుతాము మరియు మీ ఓట్లు పొందొచ్చు'' అని పేర్కొన్నారు.

''ఆడమ్ స్మిత్ మార్గదర్శక ఆర్థిక సూత్రాల ఆవిర్భావం నుండి లైసెజ్ ఫెయిర్ సిస్టమ్స్ యొక్క ప్రబలమైన సిద్ధాంతాల వరకు, ప్రైవేట్ వ్యాపార విషయాలలో ప్రభుత్వ జోక్యం ఎప్పుడూ పని చేయలేదని నిరూపించబడిన వాస్తవం'' అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ''మీ గౌరవప్రదమైన బృందం హీరోల పారితోషికాలను అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు తదితరులు రెమ్యునరేషన్ అనేది వారి సినిమా ప్రొడక్షన్‌ కి అయ్యే ఖర్చు - రాబడిని బట్టే నిర్ణయింపబడుతుంది'' అని తెలిపారు.

''మీ ప్రభుత్వానికి అట్టడుగు స్థాయి నుండి మద్దతు ఇవ్వడానికి అధికారం ఇచ్చారని.. మా తలపై కూర్చోవడానికి కాదని మీరు అర్థం చేసుకోవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు'' అని పేర్కొన్న ఆర్జీవీ.. ''టిక్కెట్టు రేట్ల విషయంపై సినీ పరిశ్రమలోని నా సహోద్యోగులందరూ తమ నిజమైన భావాలను బయటపెట్టాలని నా డిమాండ్.. ఎందుకంటే ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. తర్వాత మీ ఖర్మ.. ఇది నా అభ్యర్థన కాదు'' అని మరో ట్వీట్ చేసారు.
Tags:    

Similar News