ఎన్టీఆర్ సినిమా తీస్తున్నా-వర్మ

Update: 2017-07-04 08:27 GMT
ఎన్టీఆర్ మీద రాబోయే సినిమా విషయంలో తెలుగు ప్రేక్షకుల్ని మరింత అయోమయానికి గురి చేశాడు రామ్ గోపాల్ వర్మ. బాలయ్య తలపెట్టిన ఈ బయోపిక్ కు వర్మే దర్శకత్వం వహిస్తాడంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే బాలయ్య సన్నిహితులు మాత్రం ఇది వాస్తవం కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. గత కొన్నేళ్లలో ఎన్నో చెత్త సినిమాలు తీసిన వర్మకు ఎన్టీఆర్ సినిమా తీసే బాధ్యత అప్పగించడం ఏంటంటున్నారు. ఐతే ఇంతలో వర్మ లైన్లోకి వచ్చేశాడు. తాను ఎన్టీఆర్ మీద సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఆయనో ఆడియో క్లిప్ రిలీజ్ చేశాడు. అందులో ఎన్టీఆర్ గొప్పదనం గురించి చెబుతూ.. సినిమా చేయబోతున్న సంగతిని ధ్రువీకరించాడు. దీంతో పాటు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అంటూ స్వయంగా తాను పాడిన ఓ పాటను వర్మ జోడించడం విశేషం. ఐతే తాను బాలయ్య చేయబోయే ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నానా.. లేక వేరేగా ఎన్టీఆర్ మీద సినిమా చేయబోతున్నాననా అన్నది వర్మ స్పష్టత ఇవ్వలేదు. ఇంతకీ ఆడియో క్లిప్ లో వర్మ ఏమన్నాడంటే..

‘‘తెలుగువాడిని మొట్టమొదటిసారిగా తలత్తెకునేలా చేసింది ఎన్.టి.ఆర్ అనబడే మూడు అక్షరాలు. ఆ పేరు వింటే చాలు తెలుగువాడి ఛాతి గర్వంతో పొంగిపోతుంది. స్వాభిమానం తన్నుకొస్తుంది. ఆయన ఒక మహానటుడే కాదు. మొత్తం తెలుగు నేల ఆయనకు ముందు.. ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు.

నాకు ఆయనతో పర్సనల్ గా వున్న అనుబంధం ఏమిటంటే.. ఆయన బ్లాక్ బస్టర్ హిట్ ‘అడవి రాముడు’ సినిమా చూడటానికి 23 సార్లు బస్ టికెట్ కి డబ్బుల్లేక 10 కిమీ దూరం కాలి నడకన వెళ్లేవాడిని. అంతే కాకుండా ఎన్.టి.ఆర్ తెలుగు దేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగులో నేల ఈనినట్టు వచ్చిన  లక్షలాది మందిలో నేనూ వున్నాను.

అలాంటి అతి మామూలు నేను...  ఇప్పుడు ఎన్.టి.ఆర్ జీవితాన్నే ఒక బయోపిక్ గా తెరకు ఎక్కించడం చాలా చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అత్యంత నిజమైన ఆ మహామనిషి ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఆయన శత్రువులెవరో.. నమ్మక ద్రోహులెవరో.. ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలేమిటో  అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్.టి.ఆర్ చిత్రంలో చూపిస్తాను.

‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అని రాయప్రోలు గారంటే.. నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ కెపాసిటీలో కాకుండా 8 కోట్ల తెలుగు వాళ్లలో కేవలం ఒకడిగా ప్రపంచంలో వున్న ప్రతి తెలుగువాడికి చెప్పేది ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎంటీయారుని’ అని’’ అంటూ వర్మ ముగించాడు.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News