జనం మాట్లాడుకోవడానికి కూడా భయపడే ప్రతి వివాదాస్పద అంశంపైనా సినిమాలు తీసే రాంగోపాల్ వర్మ తాజాగా తమిళనాడు రచ్చపై కన్నేశారు. రాజకీయం సంగతి పక్కనపెడితే అసలు జయలలిత - శశికళల బంధంలో ఉన్న రహస్యమేంటన్నది తాను తన సినిమాలో బయటపెడతానని బాంబు పేల్చారు. జయలలిత - శశికళల మధ్య ఉన్న బంధంలో అనేక షాకింగ్ నిజాలున్నాయని... పోయెస్ గార్డెన్ లో పని చేస్తున్న వారు ఈ నిజాలను తనకు చెప్పారని... తాను తీయబోయే 'శశికళ' సినిమాలో ఈ నిజాలన్నీ బయటపెడతానని వర్మ ట్వీట్ చేశాడు.
అంతేకాదు.. మెజారిటీ ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతు పలకడానికి కారణం, వారంతా శశికళకు చెందిన మన్నార్ గుడి మాఫియా ఎంపిక చేసినవారేనని... ఈ విషయాన్ని కూడా పోయస్ గార్డెన్ లో పని చేస్తున్న ఓ తోటమాలి చెప్పాడని వర్మ తెలిపాడు. కనీసం వ్యతిరేకించే అవకాశాన్ని కూడా ఎమ్మెల్యేలకు శశికళ ఇవ్వడం లేదంటూ ఇవి కూడా తన సినిమాలో ఉంటాయంటున్నాడు.
మన్నార్ గుడి మాఫియా సభ్యుడు పళనిస్వామి ముఖ్యమంత్రి అయితే, డాన్ శశికళ జైలు నుంచే తమిళనాడు ప్రభుత్వాన్ని నడిపిస్తుందని వర్మ అన్నాడు. జంతువులను హింసించే జల్లికట్టు పట్ల తమకున్న ప్రేమపై తమిళులు కనీసం ఒక శాతమైనా గర్వించవచ్చని... తమిళ నాయకులు ప్రజలను జంతువులకన్నా హీనంగా చూస్తున్నారని వ్యాఖ్యానించాడు.
కాగా వర్మ గతంలో ముంబయి మాఫియాపై చాలా సినిమాలు తీశారు. అంతేకాదు.. ఏపీలో వివాదాస్పద అంశాలపైన వంగవీటి రంగా - పరిటాల రవిల చరిత్రలపైనా ఆయన సినిమాలు తీశారు. ఇప్పుడు శశికళ, జయల గురించి కూడా వర్మ కనుక సినిమా తీస్తే నిజంగా అందులో ఎన్నో సంచలనాలను ఆయన బయటపెట్టేయడం ఖాయం. అయితే... శశికళ, జయల సంబంధం గురించి చెబుతానని హింట్లు ఇచ్చిన వర్మ శోభన్ బాబు విషయం మాత్రం ప్తసావించలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/