భీమ్లాతో భూమి బద్దల్ కావడం ఖాయం!

Update: 2022-02-23 15:30 GMT
పవన్ కల్యాణ్ అభిమానులంతా కొంతకాలంగా 'భీమ్లా నాయక్' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రానా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు.

పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ కథ నడవనుంది. ఈ తరహా కథలు తెలుగు తెరను పలకరించడం చాలా తక్కువనే చెప్పాలి.

త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన ప్రతి సాంగ్ ఒక సెన్సేషన్ అయింది. సినిమాపై అంచనాలు పెంచుతూ వెళ్లింది.  ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ .. యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. ఈ వేదికపై కిన్నెర మొగిలయ్య మాట్లాడుతూ తనకి ఇంతటి పేరు రావడానికి కారణమైన పవన్ కల్యాణ్ కీ .. తమన్ కి కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఆ తరువాత పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ .. " మనసులో మంచితనం .. నిజాయితీ ఉంటే దాని తాలూకు పర్యవసానం ఇలాగే ఉంటుంది. పవన్ కల్యాణ్ గారు .. త్రివిక్రమ్ గారు బేసికల్ గా భాషా ప్రియులు .. సాహిత్య ప్రియులు. జానపద కళారూపాలు అంటే వారికి అత్యంత మక్కువ.

ఆ మక్కువ కారణంగానే పవన్ కల్యాణ్ గారి దృష్టిలో  మొగిలయ్య పడటం .. ఎక్కడో ఉన్న ఆయనను వెతికి పట్టుకుని తీసుకొచ్చి మరీ వచ్చి ఈ పాటను పాడించారు. మొగిలయ్యగారికి ఈ రికార్డింగ్ థియేటర్లు ఇవన్నీ కూడా ఆయనకి పెద్దగా అలవాటు లేని విషయం. కానీ సింగర్ శ్రీకృష్ణ సాయంతో ఆయనకి పాటను నేర్పించి పాడించారు.

అంతటి మంచి సంకల్పంతో చేసిన పని ఈ రోజున మొగిలయ్యగారిని 'పద్మశ్రీ' పురస్కారం వరకూ తీసుకుని వెళ్లింది. తెలంగాణ ప్రభుత్వం యొక్క గుర్తింపు నోచుకునేలా చేసింది. ముఖ్యంగా అంతరించిపోతున్న ఒక జానపద కళారూపాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. పవన్ కల్యాణ్ గారి పెద్ద మనసు ఫలితం ఇలా ఉంటుంది.

ఇక త్రివిక్రమ్ .. తమన్ .. పవన్ కల్యాణ్ గారి కాంబినేషన్లో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం నేను రాసిన 3 పాటలకు మంచి ఆదరణ లభించింది. 24వ తేదీన భూమి బద్దల్ కావడం ఖాయం" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News