చ‌ర‌ణ్ పై మ‌న‌సు ప‌డ్డ అమెరిక‌న్ ఎడిట‌ర్

Update: 2022-06-12 06:08 GMT
తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫాలోయింగ్ ఉన్నా అమెరికా లాంటి చోటా రికార్డులు బ్రేక్ చేస్తేనే ఆ స్టార్ కి ఉండే గుర్తింపు రెట్టింపు అయిన‌ట్టు. అమెరికా బాక్సాఫీస్ మ‌రో నైజాంగా మారిన క్ర‌మంలో అక్క‌డ పాపులారిటీ కోసం మ‌న స్టార్లు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. అమెరికా బాక్సాఫీస్ ని ఉద్ధేశించి కూడా క‌థల్ని ఎంపిక చేసుకుంటున్నారు. అయితే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ప‌ని చేసే స్టార్ల‌కు ఇలాంటి అవ‌స‌రం ఉండ‌దు.

ఇప్పుడు రాజ‌మౌళి మ‌రో ఇద్ద‌రు పాన్ ఇండియ‌న్ స్టార్ల‌ను త‌యారు చేసారు. రామ్ చ‌ర‌ణ్ .. తార‌క్ ల‌కు హిందీ బెల్ట్ తో పాటు అమెరికాలోనూ ఫాలోయింగ్ పెంచ‌డంలో అత‌డి స‌హ‌కారం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చ‌ర‌ణ్ ని ప‌వ‌ర్ ఫుల్ కాప్ పాత్ర‌లో ఆవిష్క‌రించిన తీరు న‌భూతోన‌భ‌విష్య‌తి అని చెప్పాలి. ఆ పాత్ర చ‌ర‌ణ్ కి అమెరికాలో అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ని పెంచింది.

అమెరికాలో ఆర్.ఆర్.ఆర్ కి గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కింది. అలాగే అక్క‌డ‌ చ‌ర‌ణ్ పాత్ర‌ పొందుతున్న ప్రశంసలు నిజంగా అద్భుతమైనవి అనడంలో ఎలాంటి సందేహం లేదు.  పాపుల‌ర్ మ్యాగ‌జైన్ `ఇన్ సైడర్` కరస్పాండెంట్ కిర్ స్టెన్ అకునా.. తాను రామ్ చరణ్ కి వీరాభిమానిని అయ్యానని ట్వీట్ చేసింది. అతను తన కొత్త క్రష్ అని ప్రకటించింది. త‌న టైమ్ లైన్ ను అనుసరిస్తూ అమెరికా నుండి చాలా మంది మహిళా ప్రేక్షకులు ప్రస్తుతం చరణ్ తమ సరికొత్త హృదయ స్పందన అని ట్వీట్ చేస్తున్నారు. అంతేకాదు.. RRR నెట్ ఫ్లిక్స్ వెర్షన్ నుండి స్క్రీన్ షాట్ లను షేర్ చేస్తూ హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేస్తున్నారు.

రామ్ చరణ్ పోషించిన రామ్ పాత్ర అంత బాగా యుఎస్ మ‌హిళ‌ల‌కు క‌నెక్ట‌య్యింది. ఈ పాత్ర‌ను రాజ‌మౌళి డిజైన్ చేసిన విధానం అంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉంది. చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ కానీ.. సినిమా చివరి ఎపిసోడ్ లో యాక్ష‌న్ దృశ్యాలు కానీ.. ప్ర‌తిదీ ఆకట్టుకున్నాయి. ఈ అంశాలన్నీ రామ్ చరణ్ ను హాలీవుడ్ సెలబ్రిటీలలో ఫేవరెట్ గా మారుస్తున్నాయి.

అయితే ఇదే అద‌నుగా అత‌డు హాలీవుడ్ మార్కెట్ పైనా దృష్టి సారించాల‌ని సూచిస్తున్నారు కొంద‌రు.  ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో మార్కెట్లో వ‌స్తువును ఎక్క‌డైనా సులువుగా అమ్మేయొచ్చు. క్రేజ్ ఉండ‌గానే అన్నిచోట్లా ఆర్జించాలి. దీనికోసం గేమ్ ని మార్చాల‌ని సూచిస్తున్నారు. కానీ చ‌ర‌ణ్ ఆ ప‌ని చేస్తారా?   లేదూ నేను ఇంకా తెలుగు హీరోనే.. ఏదో ఇరుగు పొరుగు భాష‌ల వ‌ర‌కే ప‌రిమితం అని స‌రిపెట్టుకుంటాడా?  గ్లోబ‌ల్ మార్కెట్ల‌పై దృష్టి సారిస్తాడా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది. ఇక హాలీవుడ్ లో న‌టించాలంటే అక్క‌డా త‌న‌కు పీఆర్ బ‌లంగా ఉండాల‌న్న‌ది తెలిసిందే. అన్న‌ట్టు హాలీవుడ్ తో బాగా క‌నెక్ష‌న్ ఉన్న `జంజీర్` స‌హ‌న‌టి ప్రియాంక చోప్రా సాయం చ‌ర‌ణ్ కోరితే బావుంటుందేమో?!
Tags:    

Similar News