జానీ మాస్టార్‌కి కోర్టు బెయిల్ మంజూరు
21 ఏళ్ల యువతి లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టార్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే
21 ఏళ్ల యువతి లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టార్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. పోలీసుల విచారణలో జానీ మాస్టార్, ఆ యువతి ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేయడం తెలిసిందే. జానీ మాస్టర్ భార్య ఆమెపై కౌంటర్ దాఖలు చేసారు. ఈ కేసులో జానీ మాస్టర్ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోర్టుకు విన్నవించారు. తాజాగా జానీ మాస్టార్ కి కోర్టులో బెయిల్ మంజూరు అయిందని సమాచారం.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే .. మాలీవుడ్ లో జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదలైన అనంతరం .. టాలీవుడ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టార్ పై 21 ఏళ్ల యువతి (అసిస్టెంట్ కొరియోగ్రాఫర్) ఫిర్యాదు చేయడం సంచలనమైంది. తాను మైనర్‌గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టార్ లైంగికంగా వేధించారని చాలా ఏళ్లుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొంది. అనంతరం జానీ మాస్టర్‌ను తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, కార్మిక సంఘం సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 19న బెంగళూరులో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు బదిలీ చేస్తారు.
అత్యాచారం, నేరపూరిత బెదిరింపు ఆరోపణలపై పిల్లలపై లైంగిక నేరాల నుండి కఠినమైన రక్షణ (పోక్సో) చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఛాంబర్ ప్యానెల్ చైర్‌పర్సన్ నటి ఝాన్సీ పేర్కొన్నారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. యువతిని కలిసిన రెండు సంవత్సరాల తర్వాత జానీ మాస్టర్ ఆమెకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఉద్యోగం ఇచ్చాడు. యువతి వాదనల ప్రకారం.. ముంబైలోని ఒక హోటల్‌లో మరో ఇద్దరు మగ డ్యాన్సర్‌లతో కలిసి ప్రదర్శన కోసం బస చేసిన సమయంలో జానీ మాస్టార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆరోపించింది. ఈ విషయాన్ని చెబితే హింసిస్తానని బెదిరించాడని, ఫోటోషూట్‌లు, రిహార్సల్స్ సమయంలో తనను మానసికంగా వేధిస్తున్నారని సదరు యువతి ఆరోపించింది. అయితే ఆ యువతి ప్రవర్తన మొదటి నుంచి తప్పుగా ఉందని, తనను పెళ్లాడాల్సిందిగా జానీని వేధించిందని ..అతడి సతీమణి ప్రత్యారోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఘటనలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.