అవెంజర్స్ తో రానా బిగ్ డీల్

Update: 2019-04-09 06:18 GMT
2018లో హాలీవుడ్ సినిమాల సంచలనాల గురించి తెలిసిందే. అవెంజర్స్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ పాంథర్ వంటి చిత్రాలు అసాధారణ విజయాలు సాధించాయి. 2019లో ఇటీవలే `కెప్టెన్ మార్వల్` రిలీజైంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ అయినా ఈ చిత్రం అసాధారణ వసూళ్లు సాధిస్తోంది. కేవలం రెండు వారాల్లో బిలియన్ డాలర్ వసూళ్ల క్లబ్ లో చేరి సంచలనం  సృష్టించింది. అయితే ఆ సినిమా అంతటి అసాధారణ విజయం సాధించడానికి కారణం 2డి వెర్షన్ తో పాటు 3డి వెర్షన్ కి అద్భుతమైన ఆదరణ దక్కడమేనని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో మరో భారీ హాలీవుడ్ చిత్రం `అవెంజర్స్ ఎండ్ గేమ్` ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 26న రిలీజవుతోంది. ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ సహా అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించి రిలీజ్ చేస్తున్నామని మార్వల్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. తాజాగా భళ్లాలదేవుడు రానా రిలీజ్ చేసిన తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంది. ``అంతా జరిగి కొన్ని యుగాలు గడిచినట్లు ఉంది. చావును జయించి ఆ గృహం నుంచి బయటపడటం, ఐరన్‌మ్యాన్‌ అవడం, నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకోవడం..`` అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆకట్టుకుంది. `నా కళ్ల ముందే నా వాళ్లు ఆవిరైపోయారు..` అని ఓ సూపర్‌ హీరో ఆవేదన... మన మధ్యలేని మన వారి కోసం చివరి శ్వాస వరకూ పోరాడుదామని వారంతా ప్రతిజ్ఞ చేయడం ట్రైలర్ పై ఉత్కంఠ పెంచింది. ఆంటోని రుస్సో, జో రుస్సోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

హైదరాబాద్ ప్రమోషన్స్ లో అవెంజర్స్ సినిమాలోని థానోస్ కి వాయిస్ ఇచ్చిన రానా పలు ఆసక్తికర సంగతుల్ని మీడియాతో ముచ్చటించారు. వేదిక మీదకు వచ్చినప్పుడే కాస్తంత స్క్రిప్టు ప్రిపేరై వచ్చినట్టున్నారు? అని మీడియా అడిగేస్తే.. అవును.. అవెంజర్స్ ఫ్రాంఛైజీ వాళ్లు సంతకం చేయించుకునేప్పుడే రూల్స్ చెప్పారని తెలిపారు. మరి మీరు హాలీవుడ్ లో సోలో సూపర్ హీరోగా నటిస్తున్నారా? అని ప్రశ్నిస్తే సాయంత్రం కలిసినప్పుడు మాట్లాడుకుందాం అంటూ నవ్వేశారు రానా.  అయినా హాలీవుడ్ రేంజు నేను కాదు.. హైదరాబాద్ లో ఉంటాను. స్ట్రీట్ బోయ్ ని అనేశారు రానా. హాలీవుడ్ స్థాయి అంటే రెహమాన్ గారు అంటూ తన పక్కనే ఉన్న ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ వైపు చూపించారు రానా.

థానోస్ ఫిలాసఫీని మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నిస్తే .. మీరైతే అంగీకరించగలరా? అని ఎదురు ప్రశ్నించిన రానా.. అవెంజర్స్ థియరీ తనకు బాగా నచ్చుతుందని అన్నారు. సూపర్ హీరో సినిమాల్లో ఫిక్షన్ తనని ఆకర్షిస్తుందని .. థానోస్ కి వాయిస్ అందించేప్పుడు చాలా విషయాలపై అవగాహన పెరిగిందని రానా తెలిపారు. మార్వల్ సంస్థతో సంతకం చేసేప్పుడే అని రానా చెప్పారు కాబట్టి అవెంజర్స్ కి అనువాదకుడిగా పని చేసినందుకు రానాకి ఎంత డీల్ కుదిరిందో అంటూ మీడియా ఆసక్తిగా ముచ్చటించుకుంది. అసలు థానోస్ కి రానానే వాయిస్ ఎందుకు ఇచ్చారు? అన్న ప్రశ్నకు అతడి వాయిస్ ఇమేజ్ పెంచుతుందని మార్వల్ సినిమా ప్రతినిధులు పేర్కొన్నారు.
Tags:    

Similar News