రానాని చీట్ చేసిన నిర్మాత‌?

Update: 2019-10-28 07:00 GMT
కొన్ని సినిమాలు ప్రారంభోత్స‌వాలు జ‌రుపుకుని ఏమ‌య్యాయో తెలీదు. మ‌ధ్య‌లోనే ఆగిపోయి సుప్తావ‌స్థ‌లోనే ఉండిపోతాయి. మ‌ధ్య‌లోనే ఆగిపోయేవి కొన్ని.. చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసుకుని రిలీజ్ ల‌కు రానివి ఇంకొన్ని ఇలా వీటికి ఎప్ప‌టికీ మోక్షం ఉండ‌దు. ఆన్ సెట్స్ కి వెళ్లాక హీరో-నిర్మాతకు మ‌ధ్య పొస‌గ‌క పోయినా లేక ఇంకేవైనా గొడ‌వ‌లున్నా ఆ ప్రాజెక్టు మూలన ప‌డిన‌ట్టే.

ఆ త‌ర‌హాలోనే దగ్గుబాటి రానా హీరోగా కె.ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తున్న 1945 మూవీ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. స‌త్య శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. రాజ‌రాజ‌న్ నిర్మాత‌. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఇది ప్రీఇండిపెండెన్స్ క‌థ‌తో తెర‌కెక్కుతోంద‌ని.. ఇందులో రానా ఐ.ఎన్.ఏ సైనికుడిగా క‌నిపించ‌నున్నారని ప్ర‌చార‌మైంది. రెజీనా ఈ చిత్రంలో క‌థానాయిక‌. కొంత చిత్రీక‌ర‌ణ జ‌రిగాక‌ ఏమైందో మ‌ధ్య‌లో ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు. సినిమా ఆగిపోయింద‌ని ప్ర‌చార‌మైంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా రానా నుంచి స‌మాధానం వ‌చ్చింది. 1945 చిత్రం టీజ‌ర్ ని 28 అక్టోబ‌ర్ సాయంత్రం 6 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్నాం అంటూ చిత్ర‌బృందం దీపావ‌ళి రోజున ఓ పోస్ట‌ర్ ని ప‌బ్లిష్ చేసింది.

ఈ పోస్ట‌ర్ చూసి ఖంగు తిన్న రానా వెంట‌నే స్పందించారు. ఇదో చీటింగ్ టాక్టిస్ అంటూ కొట్టి పారేశాడు. ఆగిపోయిన సినిమాకి టీజ‌ర్ ఏంటి? అనే అర్థంలో ప‌రిశ్ర‌మ‌ను మార్కెట్ వ‌ర్గాల్ని అప్ర‌మ‌త్తం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో నిర్మాత‌తో రానాకు స‌రిప‌డ‌లేద‌ని అర్థ‌మైంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి కాలేదు. ఇవ్వాల్సిన‌ పారితోషికాల క్లియ‌రెన్స్ కూడా లేదు. టీజ‌ర్ రిలీజ్ అంటూ మార్కెట్ వ‌ర్గాల నుంచి డ‌బ్బు కొట్టేయాల‌ని చూస్తున్నారు. జ‌నాల్ని మోసం చేయాల‌ని భావిస్తున్నారు`` అంటూ స్ట్రెయిట్ గా ఉన్న మ్యాట‌ర్ చెప్పేశాడు రానా. అయితే 1945 చిత్రీక‌ర‌ణ విష‌యంలో ఏం జ‌రిగింది.. నిజానిజాలేమిటి? అన్న‌దానిపై నిర్మాత‌లే వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంది.


Tags:    

Similar News