పొలిటికల్ ప్రమోషన్ అదిరిందిలే

Update: 2017-08-05 15:30 GMT
ఇప్పటివరకు నార్త్ ఇండియాలో మాత్రమే ఈ ట్రెండ్ ఉంది. అక్కడ పొలిటికల్ ఈవెంట్లలో కూడా సినిమాలను ప్రమోట్ చేస్తారు. ముఖ్యంగా సినిమా తాలూకు థీమ్ ఏ మాత్రం కలసినా కూడా వెంటనే అక్కడ ఆ సినిమాను ప్రమోట్ చేసుకుంటారు. మొన్ననే లక్నోలో ముఖ్యమంత్రి యోగిని కలసి తన టాయిలెట్ సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు అక్షయ్ కుమార్. ఎలాగో గవర్నమెంట్ కూడా ఈ టాయిలెట్ స్కీమును తెగ ప్రచారం చేస్తోంది కాబట్టి.. మనోడి సినిమాకు ఆ ఈవెంట్ వేదికగా సరిపోయింది.

తాజాగా హైదరాబాద్ లో హరితహారం అంటూ ఒక ఈవెంట్ జరుగుతోంది. అందరూ మొక్కలు పాతడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్లో రానా దగ్గుబాటి మరియు క్యాథరీన్ త్రెసా పాల్గొన్నారు. రానా అయితే అచ్చం తన కొత్త సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో ఎలా ఉన్నాడో అదే గెటప్ తో వచ్చాడు. ఒక రాజకీయ నాయకుడ్ని మరిపించేలా ఉన్నాడు. అయితే ఇటువంటి కార్యక్రమాలకు రానా గతంలో చాలాసార్లు హాజరైనా కూడా.. ఇప్పుడు మాత్రం తన సినిమా విడుదలవుతున్న వేళ ఇది ప్రత్యేకంగా అనిపిస్తోంది అంతే. కాకపోతే ఈ రకంగా సినిమాకు పొలిటికల్ ప్రమోషన్ అదిరిపోయినట్లే.

ఓ రకంగా ఈ శనివారం టాలీవుడ్లో పొలిటికల్ మరియు సినిమా వాళ్ళ బాండింగ్ గురించి టాక్ అదిరిందిలే. ఎందుకంటే తెలంగాణ ఎంపి కవిత కూడా తన అభిమాన నటుడు చిరంజీవితో ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. మెగాస్టార్ అభిమానిని అని చెప్పడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆమె గతంలో చాలాసార్లు తెలంగాణ పోరాటం పరంగా తను చిరంజీవికి వ్యతిరేకిని కాని.. సినిమాల పరంగా చిన్నప్పటి నుండి చిరంజీవి ఫ్యాన్ అని చాలాసార్లు తెలియజేసిందిలే.
Tags:    

Similar News