ట్రైలర్ టాక్: నెత్తుటితో యుద్ధం

Update: 2019-08-04 16:00 GMT
కొంత లేట్ అయినా విభిన్నమైన కథలను మాత్రమే ఎంచుకుంటాడని పేరున్న శర్వానంద్ కొత్త సినిమా రణరంగం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కాకినాడలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ ముఖ్య అతిధిగా ట్రైలర్ లాంచ్ చేశారు.పన్నెండు గంటలు కూడా గడవకముందే అర మిలియన్ వ్యూస్ దాటేసిన ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇక కథ విషయానికి వస్తే సుమారుగా ఓ పాతికేళ్ల క్రితం విశాఖపట్నంలో ఉండే దేవా(శర్వానంద్)స్నేహితులతో తిరుగుతూ జీవితాన్ని గడుపుతూ ఓ అమ్మాయి(కళ్యాణి ప్రియదర్శన్)ని ప్రేమిస్తూ ఉంటాడు.

ఎన్టీఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక మద్యనిషేధం అమలులోకి తేవడంతో దాన్నే ఉపాధిగా మలుచుకుని దేవా దందా మొదలుపెడతాడు. చిన్న మొక్కగా మొదలై ప్రత్యర్థులకు కునుకును దూరం చేసే మహా చెట్టై పోతాడు. ఈ క్రమంలో ఎన్నో ప్రమాదాలు పోరాటాలు. తర్వాత కొన్నేళ్లకు దేవా విదేశాల్లో ప్రత్యక్షం అవుతాడు. అక్కడో ఇంకో యువతీ(కాజల్ అగర్వాల్)దేవా జీవితం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. అసలు వైజాగ్ లో ఉండే దేవా దేశం వదిలి ఎక్కడికి వెళ్ళాడు ఇన్నేళ్ల తర్వాత శత్రువుల జాడలు అతన్ని మళ్ళీ ఎందుకు వేటాడాయి లాంటి ప్రశ్నలకు సమాధానమే రణరంగం

ట్రైలర్ రూపంలో దాదాపుగా స్టోరీ లైన్ ని రివీల్ చేసిన దర్శకుడు సుధీర్ వర్మ సబ్జెక్టులోని తీవ్రతను చక్కగా ప్రెజెంట్ చేశాడు. చాలా కాలం తర్వాత తెలుగులో ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీ ఇదేనని చెప్పొచ్చు. శర్వానంద్ దేవాగా పరకాయప్రవేశం చేసిన తీరు సీరియస్ పాత్రను హ్యాండిల్ చేసిన వైనం బాగా కుదిరాయి. హీరోయిన్ల గురించి ఎక్కువ చెప్పే అవకాశం ఇవ్వలేదు.

నీటి కోసం మూడో ప్రపంచ యుద్ధం జరిగిందంటే నమ్మలేదు ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది లాంటి డైలాగ్స్ బాగా పేలాయి. మురళీశర్మ లాంటి ఒకరిద్దరిని తప్ప ఎవరు రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. దివాకర్ మణి ఛాయాగ్రహణం ప్రశాంత్ పిళ్ళై సంగీతం వెన్నుదన్నుగా నిలిచాయి. అర్జున్-కార్తీక్ డైలాగ్స్ చురుగ్గా ఉన్నాయి. మొత్తానికి ఓ మాఫియా క్రైమ్ డ్రామాని తనదైన శైలిలో ప్రెజెంట్ చేసిన సుధీర్ వర్మ ఇప్పుడీ ట్రైలర్ ద్వారా అంచనాలు రెట్టింపు చేసేశాడు.


Full View


Tags:    

Similar News