రొయ్యల నాయుడుగా తండ్రీ కొడుకులు

Update: 2017-06-17 05:14 GMT
రావు రమేష్ ఇప్పుడు టాలీవుడ్ లో బోలెడంత క్రేజ్ ఉన్న కేరక్టర్ ఆర్టిస్ట్. రావు గోపాలరావు కొడుకు అయినా.. సొంత ప్రతిభతో నిలదొక్కుకుని ఇప్పుడు స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. రోజుకు లక్షల కొద్దీ రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి వచ్చాడు. ఈ నటుడి కోసం దర్శకులు.. రైటర్లు ప్రత్యేకంగా కేరక్టర్లు క్రియేట్ చేస్తున్నారంటే ఇతని ప్రతిభాపాటవాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుంది.

చదువుకునే రోజుల నుంచి కెమెరాపై విపరీతమైన ఆసక్తి ఉన్న రావు రమేష్.. సినిమాటోగ్రాఫర్ అవాలని కోరుకున్నాడు. కానీ 1994లో తండ్రి మరణం కారణంగా.. ప్లాన్స్ అన్నీ తారుమారయిపోయాయి. నిర్మాతగా మారదామని భావించి ఓ పెద్ద దర్శకుడితో ప్రయత్నాలు చేసినా.. డబ్బులు పోయాయ్ తప్ప సినిమా మొదలవలేదని చెబుతున్నాడు రావు రమేష్. ఆ తర్వాత చెన్నైలో మష్రూమ్ వ్యాపారం ప్రారంభిద్దామని భావించినా.. అది కూడా మొదలుకాలేదట. తల్లి చెప్పినట్లుగా యాక్టింగ్ లో ప్రయత్నిద్దామని హైద్రాబాద్ వచ్చి బోలెడన్ని ప్రయత్నాలు చేస్తే.. చివరకు సీమసింహంలో సిమ్రాన్ సోదరుడిగా ఓ పాత్ర దక్కింది కానీ ప్రయోజనం దక్కలేదని చెబుతున్నాడు రావు రమేష్.

ఆ తర్వాత సీరియల్స్ లో నటిస్తూ కొన్నేళ్ల పాటు గడిపిన తర్వాత.. రోజుకు 1500 రూపాయల రెమ్యూనరేషన్ అందుకోవడమే అతి పెద్ద ఫీట్. చివరకు గమ్యం మూవీలో క్రిష్ ఆఫర్ చేసిన కేరక్టర్.. కొత్త బంగారు లోకం బ్లాక్ బస్టర్ కావడం కెరీర్ ని మార్చేశాయని చెబుతున్నాడు.

జూన్ 23న రిలీజ్ అవుతున్న దువ్వాడ జగన్నాధం చిత్రంలో విలన్ గా నటిస్తున్న రావు రమేష్ పాత్ర పేరు రొయ్యల నాయుడు. 'ఈవీవీ చిత్రాలను హరీష్ శంకర్ ఇష్టపడతాడు. ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో నాన్న చేసిన రొయ్యల నాయుడు పాత్ర ఆయనకు చాలా ఇష్టం. డీజే చిత్రంలో నా పాత్ర పేరు కూడా అదే కానీ.. కేరక్టరైజేషన్ వేరుగా ఉంటుంది. నాన్న పేరు చెడగొట్టకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను' అంటున్నాడు రావు రమేష్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News