'కేజీఎఫ్ 2' ఎఫెక్ట్ : పవన్ మూవీలో రవీనా టాండన్!

Update: 2022-04-25 00:30 GMT
బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన నిన్నటితరం హీరోయిన్లలో రవీనా టాండన్ ఒకరు. అప్పట్లోనే మంచి ఫిట్నెస్ ను మెయింటెయిన్ చేస్తూ, యూత్ హృ దయాలను ఆమె కొల్లగొట్టేసింది. ఆ సమయంలోనే ఆమె తెలుగు  తెరపై కూడా మెరిసింది. బాలకృష్ణ  సరసన ఆమె చేసిన 'బంగారు బుల్లోడు' అప్పట్లో పెద్ద హిట్. మ్యూజికల్ హిట్ గాను ఆ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇక వినోద్ కుమార్ జోడీగా కూడా ఆమె 'రథసారథి' సినిమాలో అందాల సందడి చేసింది. ఇలా తెలుగు ప్రేక్షకులకు రవీనా పరిచయమే.

ఇక ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై రవీనా కనిపించలేదు. మళ్లీ ఇంతకాలానికి ఇక్కడి ప్రేక్షకులు ఆమెను 'కేజీఎఫ్ 2' సినిమాలో చూశారు. ఈ సినిమాలో ఆమె ప్రధానమంత్రి 'రిమికా సేన్' పాత్రలో కనిపించింది. ఈ పాత్రను చూస్తున్నవారు ఇది ఇందిరాగాంధీ పాత్ర కావొచ్చునని భావించారు. అంత పవర్ఫుల్ పాత్ర అది. ఒక వైపున అరాచకం .. మరో వైపున అవినీతి .. ఈ రెండిటిని ఫేస్ చేస్తూ ధైర్యంతో కూడిన నిర్ణయాన్ని తీసుకునే ప్రధాని పాత్రలో రవీనా తన నట విశ్వరూపాన్ని చూపించింది. అందరూ కూడా ఆమె నటన గురించి గొప్పగా చెప్పుకున్నారు.

ఆ సినిమాలో ఆమె పాత్ర .. ఆ పాత్రకి ఆమె న్యాయం చేసిన తీరు చూసిన తరువాత, 'భవదీయుడు  భగత్ సింగ్' సినిమాలో ఆమెకి ఒక కీలకమైన రోల్ ఇవ్వాలనే నిర్ణయానికి హరీశ్ శంకర్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ పాత్రకి ఆమె కరెక్టుగా సెట్ అవుతుందనే అభిప్రాయాన్ని పవన్ కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ రవీనాను హరీశ్ శంకర్ సంప్రదించడం .. ఆమె పాత్ర గురించి చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. ఆ పాత్రను చేయడానికి ఆమె ఓకే చెప్పిందని కూడా అంటున్నారు.

ప్రస్తుతం పవన్ .. 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత ఆయన హరీశ్ శంకర్ తో సెట్స్  పైకి వెళ్లనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్  పైకి వెళ్లనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో, సహజంగానే ఈ సినిమాపై  అంచనాలు ఉన్నాయి. ఇక రవీనా కూడా చేస్తుందంటే ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం. ఈ సినిమాతో మరో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ  ఇస్తుందన్నమాట. ఇక కథానాయికగా పూజ హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News