రవిబాబు సైలెంట్ గా అంటించి వదిలేసిన వీడియో బాంబు పేలినట్టేనా?

Update: 2021-10-08 04:30 GMT
'మా' ఎన్నికలకు సంబంధించిన పరిణామాలు ఏ రోజుకు ఆ రోజు మరింత వేడెక్కుతున్నాయి. ఎవరికివారు ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీలో ఉన్న మంచు విష్ణు వైపుకు వెళ్లి ఆయనకి  సపోర్ట్ చేసేవాళ్లు కొందరైతే, ప్రకాశ్ రాజ్ వైపుకు వెళ్లి ఆయనకి చప్పట్లు కొట్టేవాళ్లు మరికొందరు. ఒకరు అనుసరిస్తున్న పద్ధతులను మరొకరు ఎండగడుతూ, ఎద్దేవా చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రకాశ్ రాజ్ ను ఎదుర్కోవడానికి అవతల ప్యానల్ వారు ఆయన 'నాన్ లోకల్' అంటూ మొదటి అస్త్రం వదిలారు.

ఈ అస్త్రాన్ని ప్రకాశ్ రాజ్ తెలివిగానే ఎదుర్కొన్నారు. చాలామందికంటే తాను తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతాననీ, తాను పలకడం వలన తెలుగు భాష గర్వపడుతుందని పంచ్ ఇచ్చాడు. మనం గెలవాలనుకోవడానికీ .. అవతలవాడిని ఓడించాలనుకోవడానికి మధ్య తేడా ఉందంటూ అసహ్యాన్ని వ్యక్తం చేశారు. పోస్టల్ ఓట్ల విషయంలో  అవినీతి జరిగిందని ప్రకాశ్ రాజ్ అంటే, అదంతా అధికారికంగా జరిగిందేనని విష్ణు మండిపడ్డాడు. ఇక ఈ సమయంలోనే వీరిని సమర్ధించేవారు కూడా రంగంలోకి దిగిపోయారు. తాము ఎవరివైపు అనే విషయం చెప్పకుండానే, ఎవరికి ఓటు వేయాలనేది చెప్పేస్తున్నారు.

 
అందుకు ఒక ఉదాహరణగా నటుడు .. దర్శకుడు రవిబాబు చేసిన వీడియో చెప్పుకోవాలి. ఒక కథను చాలా నీట్ గా .. తక్కువ నిడివితో అసలు విషయం అర్థమయ్యేలా చెప్పే టాలెంట్ ఆయనకి ఉంది. అందువల్లనే ఇప్పుడు 'మా' ఎన్నికల గురించి ఆయన చేసిన చిన్న వీడియో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఆ వీడియోలో ఆయన ప్రస్తావించిన అంశాలు ప్రకాశ్ రాజ్ కి పడే ఓట్లపై  ప్రభావం చూపేలా ఉన్నాయని అంటున్నారు. ఇది లోకల్ .. నాన్ లోకల్ సమస్య కాదంటూనే, రవిబాబు తెలివిగా అదే విషయాన్ని గురించి మాట్లాడాడు. తెలుగు సినిమాల్లో ఇతర భాషలకు చెందిన నటీనటులు .. సంకేతిక నిపుణుల ప్రభావం .. పెత్తనం గురించి ప్రస్తావించాడు.

ఇతర భాషల్లోనివారికి భారీ పారోతోషికాలు ఇస్తూ .. వసతి సౌకర్యాలు కల్పించడం తెలుగువారిని అవమానపరచడమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తెలుగు కెమెరామెన్లు 150 నుంచి 200మంది వరకు ఇళ్లలో ఖాళీగా కూర్చుని ఉంటే,  ఇతర భాషల్లోని వారు ఇక్కడ తమ జోరును చూపుతున్నారనే ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడు మన సంఘాన్ని నడిపే అవకాశం కూడా పరాయివారికే ఇచ్చేద్దామా? ఒకసారి ఆలోచించండి అంటూ రవిబాబు చాలా క్లియర్ గా తన మనసులోని మాటను చెప్పాడు .. సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాడు. 'ఎంత చెప్పామనేది కాదు .. ఏం చెప్పాము .. ఎలా చెప్పామనేదే పాయింటు' అన్నట్టుగా వ్యవహరించాడు.

ఇక 'మన ఇంటి తాళాలు వేరే వాళ్లకు ఇస్తామా' అని రాజీవ్ కనకాల అంటే, నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. ఒక మలయాళీ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ మాట ఎలా అంటావు? అంటూ కామెంట్లతో దాడి చేశారు. కానీ రవిబాబు వీడియోపై ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే మొదటి నుంచి రవిబాబు వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అనవసరమైన విషయాల్లో ఆయన జోక్యం చేసుకున్న సందర్భాలు కనిపించవు. 'మా' విషయంలో ఒక దర్శకుడిగా .. నటుడిగా తన అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పులేదు కనుక ముందుకు వచ్చాడు. ఇంతవరకూ ఆయన తన సినిమాలలో నటీనటులుగా .. సాంకేతిక నిపుణులుగా తెలుగువారిని తీసుకుంటూ రావడం వలన, ఎదురుదాడి చేసే అవకాశం లేకుండా పోయిందని చెప్పుకుంటున్నారు.         
Tags:    

Similar News