పోలీసులకు పట్టుబడ్డ మాస్ రాజా

Update: 2016-05-19 09:21 GMT
మామూలుగా రవితేజ తమ్ముళ్లు మాత్రమే పోలీసులకు దొరుకుతుంటారు. డ్రగ్స్ కేసులోనో.. తాగి కారు నడిపిన కేసులోనో మాస్ రాజా తమ్ముళ్లు పోలీసులకు దొరకడం చాలా మామూలు విషయం అయిపోయింది. ఐతే ఇప్పుడు ఆవ్చర్యకరంగా రవితేజానే పోలీసులు బుక్ చేశారు. ఐతే మాస్ రాజా చేసింది మరీ పెద్ద తప్పేమీ కాదులెండి. తన కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసుకుని ప్రయాణించడమే మాస్ రాజా చేసిన తప్పు. ఈ తప్పిదానికి అతను ఫైన్ కూడా కట్టాడు.

గురువారం ఏపీ డీకే 4742 నంబరు కారులో రవితేజ ప్రయాణిస్తుండగా.. జూబ్లీహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసి ఉండటంతో అభ్యంతరం చెప్పారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని చెబుతూ.. అప్పటికప్పుడు ఆ  ఫిల్మ్ ను పోలీసులు తొలగించారు. నిబంధనల ప్రకారం రూ.800 జరిమానా విధించారు. చలానా రాశారు. రవితేజ వెంటనే జరిమానా చెల్లించేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇదే తప్పిదానికి జరిమానా చెల్లించిన సంగతి తెలిసిందే. కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ పెట్టుకోవడం ద్వారా నేరస్థులు ఈజీగా తప్పించుకుంటున్నారని.. పైగా కార్లలో లైంగిక కార్యకలాపాలు కూడా ఎక్కువైపోతున్నాయన్న ఉద్దేశంతో వాటిపై నిషేధం విధించారు. ఐతే సెలబ్రెటీలు మాత్రం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ప్రైవసీ కోసం ఇప్పటికీ తమ కారు అద్దాలకు ఫిల్మ్ ఉపయోగిస్తూనే ఉన్నారు.
Tags:    

Similar News