ఇన్నాళ్లు ఊరించి ఉసూరుమనిపించిన రవితేజ

Update: 2018-11-14 15:30 GMT
రవితేజ ఈమద్య కాలంలో సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘టచ్‌ చేసి చూడు’, ‘నేల టికెట్‌’ ఫ్లాప్‌ నేపథ్యంలో ఆయన సినిమాల సంఖ్య కూడా తగ్గించినట్లుగా అనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ మరో వైపు వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో సినిమాకు సిద్దం అయ్యాడు. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో మూవీకి డిస్కో రాజా అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే రవితేజ ‘తేరి’ రీమేక్‌ లో కూడా నటిస్తాడని వార్తలు వచ్చాయి.

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన ‘తేరి’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రాన్ని తెలుగులో డబ్‌ చేశారు. అయితే పెద్దగా తెలుగు ప్రేక్షకులను డబ్బింగ్‌ వర్షన్‌ అలరించలేదు. ఆ సినిమాను పవన్‌ హీరోగా సంతోష్‌ శ్రీనివాస్‌ రీమేక్‌ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. పవన్‌ ఒప్పుకోవడం, మైత్రి మూవీస్‌ వారు ముందుకు రావడం జరిగింది. అయితే అజ్ఞాతవాసి ఫ్లాప్‌ తో సినిమాల విషయంలో పవన్‌ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయిన పవన్‌ సినిమాలు చేయడని తేలిపోయింది. దాంతో మైత్రి వారు ఆ సినిమా రీమేక్‌ ను రవితేజతో చేయాలని భావించారు. సంతోష్‌ శ్రీనివాస్‌ కూడా చిన్న చిన్న మార్పులతో రవితేజ కోసం స్క్రిప్ట్‌ సిద్దం చేశాడు.

ఇటీవలే మైత్రి మూవీస్‌ నిర్మాతలు మాట్లాడుతూ తేరి రీమేక్‌ ను రవితేజతో చేస్తామని ప్రకటించారు. కాని తాజాగా రవితేజ మాత్రం తాను తేరి రీమేక్‌ లో నటించడం లేదని, ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీపైనే ఉందని చెప్పుకొచ్చాడు. అయితే భవిష్యత్తులో తేరి మూవీ రీమేక్‌ గురించి ఆలోచిస్తానేమో చెప్పలేను అన్నాడు. రెండు సక్సెస్‌ లు పడితే అప్పుడు తేరి ని చేసేందుకు రవితేజ ముందుకు వస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News