శంక‌ర్ తో RC15.. చ‌ర‌ణ్ ఫోటోషూట్.. లాంచింగ్ డేట్ ఫిక్స్

Update: 2021-08-25 16:30 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల‌తో సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో  RRR షూటింగ్ దాదాపు పూర్త‌యింది. త‌దుప‌రి ఆర్.సి 15 కోసం చ‌ర‌ణ్ ప్రిప‌రేష‌న్ లో ఉన్నాడు. శంకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రం సెట్స్ లోకి చేరబోతున్నాడు. సెప్టెంబర్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

ఇప్ప‌టికే ఈ మూవీ కోసం భారీ సెట్ ని నిర్మించారు. తొలిగా రామ్ చరణ్ -కియారా అద్వానీలపై ఒక‌ పాటను చిత్రీకరిస్తారు. దీనికి ముందు సెప్టెంబర్ 7 న ఒక ప్రైవేట్ స్టూడియోలో రామ్ చరణ్ మీద ఫోటో షూట్ నిర్వహిస్తారని తెలిసింది. ఎక్కువ భాగం హైదరాబాద్ ప‌రిస‌రాల్లోనే పూర్తి చేయాల‌న్నది ప్లాన్. పుష్ప విల‌న్ ఫహద్ ఫాసిల్ ఇందులో విల‌న్ గా న‌టిస్తార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అలాగే బాలీవుడ్ నుంచి ప్ర‌ముఖ న‌టుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ స‌ర‌స‌న కియ‌రా క‌థానాయికగా న‌టిస్తుండ‌గా ఇందులో త‌మ‌న్నా విల‌న్ గా న‌టిస్తుంద‌ని అంజ‌లి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ మూవీ వచ్చే ఏడాది అన్ని భారతీయ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా క‌థాంశం గురించి ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం ఉంది. ప్ర‌స్తుత వ్య‌వ‌స్థ‌లో రాజ‌కీయ అవ్య‌వ‌స్థ గురించి తెలిసిన‌దే. స‌మాజాన్ని బాగు చేసేందుకు ఉప‌యోగ‌ప‌డాల్సిన రాజ‌కీయాలు స్వార్థ‌పూరిత ప్ర‌యోజ‌నాల కోసం సామాన్య ప్ర‌జ‌ల‌పై పెత్త‌నం చెలాయించేందుకు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌న్న అభిప్రాయం ఉంది. అంతా అవినీతిమ‌యం. రాజ‌కీయం అధికారులు ఒకే దారిలో ఉన్నారు. అయితే ఈ వ్య‌వ‌స్థ‌ను ఇలానే వ‌దిలేస్తే .. సంఘంలో ఉన్న ఐఏఎస్ లు ఎందుకు?  అస‌లు ముఖ్య‌మంత్రి అనేవాడే ఎందుకు? ఎవ‌రి స్వార్థానికి వారు దోచుకు తిన‌డ‌మే ధ్యేయంగా బ‌తికేసి జ‌నాల్ని భృష్ఠుప‌ట్టించే వారిని దారికి తేవాల‌న్న‌ది ఈ సినిమా క‌థాంశం.

# RC15 శంక‌ర్ మార్క్ ట్రీట్ మెంట్ తో స్పెష‌ల్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ యువ ఐఏఎస్ గా క‌నిపిస్తార‌ని.. ఆ త‌ర్వాత  అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి రాజకీయ వ్యవస్థను పునరుద్ధరించే బాధ్యతను తీసుకునే యువ ముఖ్యమంత్రి అవుతారని తెలుస్తోంది‌. కాన్సెప్ట్ ఇంచుమించు ఒకే ఒక్క‌డు థీమ్ తో ఉన్నా నేటి జ‌న‌రేష‌న్ కి త‌గ్గ‌ట్టుగా ఉంటుంది.  సామాజిక రాజ‌కీయాంశాల్ని ట‌చ్ చేస్తూ ఓ లెవ‌ల్లోనే ఈ మూవీని తెర‌కెక్కించ‌నున్నారు. చ‌ర‌ణ్ ని సీఎంగా చూపిస్తారన‌గానే అభిమానుల్లో ఎంతో ఆస‌క్తి నెల‌కొంది.  శంక‌ర్ - రామ్ చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో పెద్ద డిబేట్ కి తెర తీయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ పై ఇప్ప‌టికే పాన్ ఇండియా లెవ‌ల్లో అత్యంత భారీ అంచ‌నాలేర్ప‌డ‌గా థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఆ త‌ర్వాత వెంట‌నే శంక‌ర్ తో సినిమా అంటే చెర్రీ అభిమానులు సంబ‌రాల్లో మునిగి తేలుతున్నారు. ఇది చ‌ర‌ణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న ప్ర‌చారం ఉంది.
Tags:    

Similar News