బాలకృష్ణ మౌనానికి కారణం అదే

Update: 2019-03-10 03:25 GMT
ఒకపక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ హైప్ రోజు రోజుకి పెరిగిపోతోంది.  రెండు ట్రైలర్లతో పాటు ప్రీ రిలీజ్ రోజు వర్మ చెప్పిన సంచలనాత్మక విషయాలు ఇప్పటికే హాట్ టాపిక్ గా మారాయి. దీనిని అడ్డుకునేందుకు నారా నందమూరి కుటుంబాలు గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి కాని వాటికి సరైన ఆధారాలు కనిపించడం లేదు. సెన్సార్ మెట్ల దగ్గర స్కెచ్ వేశారో లేక కోర్ట్ లో తేల్చుకునేందుకు డిసైడ్ అయ్యారో మొత్తానికి క్లారిటీ అయితే మిస్ అవుతోంది .

బాలకృష్ణ ఏమైనా స్పందిస్తాడేమో అనుకుంటే బయోపిక్ డిజాస్టర్ తాలుకు ఫలితం నుంచి ఇంకా కోలుకోనట్టే కనిపిస్తోంది. నన్ను చంపినా యుట్యూబ్ కో రిలీజ్ చేస్తానని చెప్పి వర్మ మరో బాంబు కూడా వేశాడు. సో దీన్ని పూర్తిగా అడ్డుకోవడం జరగని పనే. థియేటర్లలో వేయకుండా సెన్సార్ ద్వారా అడ్డుపుల్ల వేయొచ్చు కాని డిజిటల్ సినిమాకు అలాంటి అడ్డంకులు ఉండవు. ఆ ధీమాతోనే వర్మ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు

కాని బాలకృష్ణ మరీ సైలెంట్ గా ఉండటం అభిమానులకు అంతు చిక్కడం లేదు. నాన్నను వియ్యంకుడిని స్వయానా సోదరి భర్తను ఇలా డ్యామేజ్ అయ్యే రీతిలో చూపిస్తూ సినిమా తీస్తే బాలయ్య ఒక్క మాటా అనడం లేదేమని అనుకుంటున్న ఫ్యాన్స్ లేకపోలేదు. పైగా ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ను బాలకృష్ణకే అంకితం చేశాను అంటూ ఇంకాస్త రెచ్చగొట్టే ప్రయత్నం  చేశాడు వర్మ. అయితే ఇదంతా గమనిస్తూనే ఉన్న బాలయ్య కావాలనే స్పందించడం లేదని సన్నిహిత వర్గాల మాట.

చిన్న మాట అన్నా దాన్ని సైతం తనకే అనుకూలంగా పబ్లిసిటీ చేసుకునే వర్మకు అలాంటి అవకాశం ఇవ్వకూడదనే నిర్ణయించుకున్నట్టు సమాచారం. లీగల్ గా తీసుకునే చర్యలు కనక ఫలితాన్ని ఇవ్వకపోతే అలా చూస్తూ వదిలేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ముప్పై ఏళ్ళ క్రితం కృష్ణ బ్యాచ్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేస్తూ నాలుగైదు సినిమాలు చేస్తే ఒకటి మినహా అన్ని ఫ్లాప్ అయ్యాయి. తర్వాత ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్టించారు.

అందుకే ఇప్పుడు కూడా అదే జరుగుతుందని వర్మ చూపించినంత మాత్రం బాబుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని భావిస్తున్నట్టు వినికిడి.  అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. మరీ ఇంత కూల్ గా ఉండటం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ కిందకు వస్తుందేమో బాలయ్యా

Tags:    

Similar News