శ్రీదేవి రాజకీయాల్లోకి ఎందుకు రాలేదంటే?

Update: 2018-02-26 00:46 GMT
దేవకన్యకు నిర్వచనంగా ఇరవై ఏళ్ళ క్రితం యువతకు నిద్రను దూరం చేసిన శ్రీదేవి అకాల మరణం ప్రతి ఒక్క సినిమా ప్రేమికుడిని తీవ్ర క్షోభకు గురి చేస్తోంది. దానికి తోడు తన పార్థీవ దేహం రావడంలో విపరీతమైన ఆలస్యం జరుగుతూ ఉండటం కూడా అసహనానికి కారణం అవుతోంది. గత 30 గంటలుగా మీడియాతో సహా సినిమా రంగంతో సంబంధం ఉన్న వారు - ఆసక్తి ఉన్న వారు అందరూ తన జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ చివరి చూపు కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే పలు ఆసక్తికరమైన సంగతులు బయటికి వస్తున్నాయి.ముఖ్యంగా హీరొయిన్ గా తన కెరీర్ పీక్స్ లో ఉన్న 80 దశకంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అవేంటో చూద్దాం.

అందరు సినిమా స్టార్స్ లాగే శ్రీదేవికి కూడా రాజకీయాల్లోకి రావాలని బలంగా ఉండేది. దానికి ప్రధాన కారణం తండ్రి అయ్యప్పన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావడమే కాక అప్పటి ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ తో మంచి సత్సంబంధాలు కలిగి ఉండేవారు. శ్రీదేవి నాలుగేళ్ల వయసప్పుడే తన గ్రేస్ పసిగట్టిన కామరాజ్ సినిమాల్లో నటింపజేయమని సలహా ఇచ్చాడు. ఈ కారణంగానే అయ్యప్పన్ అవకాశం కోసం నిర్మాత చిన్నప్ప దేవర్ దగ్గరకు పాపను తీసుకెళ్ళాడు. ఇక అక్కడ మొదలైన నడక పరుగులా మారడానికి పెద్ద టైం పట్టలేదు. స్టార్ హీరొయిన్ గా మారాక అంతులేని తన ఇమేజ్ తో రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా సేవ చేయాలనే తలంపు శ్రీదేవికి కలిగింది. తండ్రి వారసత్వం కూడా నిలబెట్టినట్టు ఉండటమే కాక మంచి స్థానానికి వెళ్తే నాన్న సంతోషిస్తారని శ్రీదేవి గట్టి నిర్ణయమే తీసుకుంది.

కాని పరిస్థితులు తనకు అనుకూలంగా లేవు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆఫర్లు - స్టార్ హీరోలకు సమానంగా లేదా అంతకన్నా ఎక్కువగా రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్న నిర్మాతలు - అంతకంతకు పెరిగిపోతున్న ఫాన్ ఫాలోయింగ్ ఇవేవి వేరే ఆలోచన చేసేందుకు అవకాశం ఇవ్వలేకపోయాయి. అలా తండ్రి చిరకాల వాంఛ శ్రీదేవి నెరవేర్చలేకపోయింది. 96 లో బోనితో పెళ్లి జరిగాక మరోసారి ఆ ఆలోచన చేసింది కాని తన సమకాలీకులు అయిన హీరొయిన్లు పాలిటిక్స్ లో ఫెయిల్ అవ్వడం గమనించి ఆ ఆలోచన పూర్తిగా మానుకుందట. అదండీ శ్రీదేవి ఆగిపోయిన శ్రీదేవి రాజకీయ రంగప్రవేశం కథ.
Tags:    

Similar News