అప్పట్లో రెబల్ స్టార్ పై తండ్రికి అందిన ఆకాశరామన్న ఉత్తరం!

Update: 2022-09-11 15:35 GMT
కృష్ణంరాజు జమీందారుల కుటుంబంలో పుట్టిపెరిగారు. అందువలన ఆయనకి కష్టం .. నష్టం తెలియదు. అప్పట్లో ఆ ఊళ్లోవారికి కృష్ణంరాజు ఫ్యామిలీనే పెద్ద దిక్కుగా ఉండేది. అందువలన తన కొడుకులో అహంభావం  పెరుగుతుందేమోననే ఉద్దేశంతో కృష్ణంరాజును ఆయన తండ్రి తమ బంధువుల దగ్గర ఉంచి చదివించారు. సంపన్న కుటుంబం నుంచి రావడం వలన, కృష్ణంరాజు లైఫ్ స్టైల్ మొదటి నుంచి కూడా సరదాగా .. సందడిగానే సాగిపోతూ వచ్చింది. కాలేజ్ రోజుల్లో తాను సినిమాలను విపరీతంగా చూసేవాడినని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

ఎన్టీఆర్ పౌరాణికాలు .. ఏఎన్నార్ సాంఘికాలు ఎక్కువగా చూస్తూ వచ్చిన ఆయనకి, సహజంగానే సినిమాల వైపుకు మనసు మళ్లింది. మంచి  హైటూ పర్సనాలిటీ ఉండటం వలన ఆయన సినిమాల్లో రాణించడం ఖాయమని స్నేహితులు ప్రోత్సహించడంతో ఆయనలో ఆ కోరిక మరింత బలపడింది. ఆ దిశగానే ఆయన ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్మాతల కంటగానీ ..  దర్శకుల కంటగాని పడితే, మా సినిమాలో చేస్తావా? అని అడిగేంత స్టైల్ గా కృష్ణంరాజు లైఫ్ స్టైల్ ఉండేది. ఆయన తన స్థాయికి తగినట్టుగానే జల్సా చేస్తూ .. బైక్ పై చక్కర్లు కొడుతూ ఉండేవారట.

ఇదంతా రెగ్యులర్ గా గమనిస్తూ వచ్చిన ఒక స్నేహితుడు, కృష్ణంరాజు పట్ల అసూయతో ఆయన తండ్రికి ఆకాశరామన్న ఉత్తరం రాశాడట. ఇక్కడ మీ అబ్బాయి జల్సాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. మీరు గనుక వెంటనే అడ్డుకట్ట వేయకపోతే, మరింతగా చేయిదాటిపోయే ప్రమాదం ఉంది' అనేదే ఆ  ఉత్తరం సారాంశం. ఆ ఉత్తరం చదివిన కృష్ణంరాజు తండ్రి ..  తాను ఒక లెటర్ రాసి .. దానికి ఆకాశరామన్న ఉత్తరాన్ని కూడా జోడించి పోస్టు చేశారట. తన వెనకలేం  జరుగుతుందో తెలియని కృష్ణంరాజు ఎప్పటిలానే హ్యాపీగా  రోజులు గడిపేస్తున్నారు.

అలాంటి సమయంలోనే తండ్రి నుంచి ఆయన కి లెటర్ వచ్చింది. "నువ్వు నా కొడుకువి .. నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఇలాంటి స్నేహితులను మాత్రం కాస్త దూరంగా ఉంచు". అనే మాటలను చదివిన కృష్ణంరాజుకి వెంటనే కన్నీళ్లు వచ్చాయట. ఈ విషయాన్ని కృష్ణంరాజు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పిల్లలను ఐదేళ్ల వరకూ దేవుడిలా .. 18 ఏళ్ల వరకూ బానిసలా .. ఆ తరువాత స్నేహితుడిలా  చూడాలని అంటారు. నిజం చెప్పాలంటే మా నాన్నగారు నన్ను అలాగే చూశారు. నాపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నేను చివరివరకూ కాపాడుకుంటూ వచ్చాను" అని చెప్పుకొచ్చారు. అలా తనని తాను మార్చుకుంటూ .. మలచుకుంటూ వచ్చిన కృష్ణంరాజు ఈ లోకాన్ని వీడి వెళ్లడం, ఆయన భిమానులకు తీరని లోటే!  
Tags:    

Similar News