మోదీ బ‌యోపిక్‌ కి రిలీజ్ క‌ష్టాలు!

Update: 2019-03-28 14:55 GMT
పీఎం న‌రేంద్ర మోదీ బ‌యోపిక్ కి రిలీజ్ క‌ష్టాలు త‌ప్ప‌లేదా? అంటే త‌ప్ప‌లేద‌నే తెలుస్తోంది. ఎన్నిక‌ల వేడి రాజుకుంటున్న వేళ రాజ‌కీయ నాయ‌కుల‌ బ‌యోపిక్ ల‌కు చిక్కులు త‌ప్ప‌డం లేదు. ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో ఆర్జీవీ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నిలిపేయాలంటూ కోర్టు ఆర్డ‌ర్ల‌పైనా చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు  `పీఎం న‌రేంద్ర మోదీ` బ‌యోపిక్ రిలీజ్ ని ఆపాలంటూ ప్ర‌తిప‌క్షాలు రుబాబ్ చేయ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ వేడెక్కిస్తోంది. తాజాగా న్యూదిల్లీలో ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ఆఫ్ ఇండియా ప్ర‌తినిధులు మోదీ బ‌యోపిక్ ని వీక్షించారు. షోకాజ్ నోటీస్ అందుకున్న అనంత‌రం ఈసీ ఈ బ‌యోపిక్ ని ప‌రిశీలించింది. అయితే ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా ప‌డిందా లేదా? అన్న‌ది ఇప్ప‌టికి ఇంకా స‌స్పెన్స్.

ఇటీవ‌లే కోర్టు ఎదుట హాజ‌రైన వివేక్ ఒబెరాయ్ వ్య‌క్తిగ‌త లాయ‌ర్ .. సినిమా గురించి సంపూర్ణ వివ‌రాల్ని కోర్టు వారికి అంద‌జేశామ‌ని ఎల‌క్ష‌న్ మోడ‌ల్‌ కోడ్ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించే ఎలాంటి అంశాలు ఈ చిత్రంలో లేనేలేవ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దానికి నిర్మాత సందీప్ సింగ్ స‌హా టీమ్ వివ‌ర‌ణ ఇచ్చార‌ని వెల్ల‌డించారు.

మ‌రో వైపు సామాజిక మాధ్య‌మాల్లో ద‌ర్శ‌కుడు ఒమంగ్ కుమార్ ఈ సినిమా రిలీజ్ తేదీని ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 5న య‌థావిధిగా పీఎం న‌రేంద్ర మోదీ సినిమా రిలీజ‌వుతోంద‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ బ‌యోపిక్ పై దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దేశంలోని 23 భాష‌ల్లో మోదీ బ‌యోపిక్ ని రిలీజ్ చేయ‌డం ఆస‌క్తి పెంచుతోంది. ఇది ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తుందా? అన్న మీమాంస‌ నెల‌కొంది.


Tags:    

Similar News