'దెయ్యం' వచ్చిందని ఎంతమందికి తెలుసు..?

Update: 2021-04-17 09:46 GMT
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు ప్రేక్షకులను భయపెట్టడం ఇష్టమనే విషయం తెలిసిందే. హార‌ర్ సినిమాలు చేసి ఒక విధంగా.. చెత్త సినిమాలు చేసి మరో విధంగా ఆడియన్స్ ని భయపెడుతుంటాడు. అప్పట్లో ‘దెయ్యం’ పేరుతో ఓ సినిమా చేసిన వర్మ.. ఇప్పుడు ‘ఆర్జీవీ దెయ్యం’ పేరుతో మరో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. యాంగ్రీ మ్యాన్ రాజ‌శేఖ‌ర్‌ - స్వాతిదీక్షిత్‌ ప్రధాన పాత్రలతో ఆరేళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ 'ప‌ట్ట ప‌గ‌లు' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రాన్ని ''ఆర్జీవీ దెయ్యం'' గా పేరు మార్చి నిన్న (ఏప్రిల్ 16) శుక్రవారం విడుదల చేశారు. వర్మ సినిమాలు చూడటానికి ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అయితే 'ఆర్జీవీ దెయ్యం' విషయంలో మాత్రం అది కనిపించడం లేదు.

కరోనా లాక్ డౌన్ ఎత్తేసి థియేటర్స్ రీ ఓపెన్ చేసిన తర్వాత ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి. అయితే ఈవారం సినిమాల సందడి పెద్దగా కనిపించ లేదు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో 'లవ్ స్టోరీ' సినిమా వాయిదా పడటంతో ప్రేక్షకులు థియేటర్ కు రప్పించే క్రేజీ మూవీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ స్టోరీ అందిస్తూ నిర్మాతగా మారి నిర్మించిన '99 సాంగ్స్ మరియు 'ఆర్జీవీ దెయ్యం' సినిమాలు రిలీజ్ అయ్యాయి. హీరోహీరోయిన్లు తెలియని వాళ్ళు కావడం.. ప్రచార చిత్రాలు కూడా ఇది తెలుగు సినిమా కాదు అనుకునే విధంగా ఉండటంతో తెలుగు ఆడియన్స్ కి '99 సాంగ్స్' చేరలేదు. ఇక 'ఆర్జీవీ దెయ్యం' అనే సినిమా ఒకటుందని.. అది ఈ శుక్రవారం రిలీజ్ అయిందని చాలా మందికి తెలియలేదు. దీంతో ఈ సినిమాకు బుకింగ్స్ లేవు. తెలిసిన వాళ్ళు కూడా కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమా కోసం థియేటర్ల వరకు రాలేదని తెలుస్తోంది. సినిమా చూసిన వాళ్ళు కూడా 'ఆర్జీవీ దెయ్యం' క‌థలో కానీ, క‌థ‌నంలో కానీ కొత్తద‌నం ఏమీ లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారమంతా 'వకీల్ సాబ్' తో కలిసి ఈ సినిమాలు ఎలా నెట్టుకొస్తాయో చూడాలి.
Tags:    

Similar News