#కొవిడ్ ఫైల్స్.. ప్ర‌భుత్వాల అస‌మ‌ర్థ‌త అజాగ్ర‌త్తను త‌వ్వి తీస్తాడ‌ట‌!!

Update: 2022-07-22 04:10 GMT
క‌రోనా ఓ వైపు క‌ల్లోలం సృష్టిస్తుంటే దాని గురించి ఆలోచించేందుకైనా ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతుంటే ఆర్జీవీ ఏకంగా సినిమా తీసి చూపించారు. `క‌రోనా వైర‌స్` పేరుతో అప్ప‌ట్లో ఆయ‌న ఒక ర‌కంగా గుబులు పుట్టించాడు. క‌రోనా వ‌చ్చిన రోగిని ఇంట్లో ఎలా చూస్తారో.. క‌రోనా ప్రారంభ స‌మ‌యాల్లో ప్ర‌జ‌ల భ‌యాందోళ‌నలు ఎలా ఉండేవో క‌ళ్ల‌కు గ‌ట్టారు ఆ సినిమాలో. క‌రోనా చావు ఆర్త‌నాదం ఎలా ఉంటుందో కూడా ధైర్యంగా చూపించింది ఆర్జీవీ ఒక్క‌డే. స‌రైన టైమింగుతో సినిమా తీయ‌డంలో ఆయ‌న త‌ర్వాతేన‌ని నిరూపించాడు.

ఇప్ప‌టికీ ఆర్జీవీని క‌రోనా క‌ల‌త‌ వ‌దిలిన‌ట్టు లేదు. అత‌డు మ‌ళ్లీ కొవిడ్ ఫైల్స్ అంటూ ప్ర‌కంప‌నాలు సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. #కోవిడ్ ఫైల్స్  క‌థాంశం గురించి కూడా ఆయ‌న హింట్ ఇచ్చేశారు. ``ల‌క్ష‌లాది మంది ప్రాణాల్ని బ‌లిగొన్న కొవిడ్ విష‌యంలో ప్ర‌భుత్వాల అస‌మ‌ర్థ‌త‌-అజాగ్ర‌త్త‌- అవినీతిని బ‌య‌ట‌పెట్టే సినిమా ఇది`` అని ప్ర‌క‌టించారు.

దీనిని బ‌ట్టి ఆర్జీవీ ఏకంగా తేనెతుట్ట‌ను క‌ద‌ప‌బోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ స‌హా దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆస్ప‌త్రులు క‌రోనా చికిత్స‌ పేరుతో ప్ర‌జ‌ల్ని భారీగా దోచుకున్నాయి. చ‌నిపోతాడు అని తెలిశాక కూడా ఐసీయులో ఉంచి రోగి కుటుంబం నుంచి ల‌క్ష‌ల్లో దుచుకున్న అవినీతి కార్పెరెట్ ఆస్ప‌త్రులు కోకొల్ల‌లు. దీనిపై నిరంత‌రం మీడియాల్లో బోలెడ‌న్ని క‌థ‌నాలు కూడా వెలువ‌డ్డాయి. మాన‌వీయ‌త‌ను మంట క‌లిపి కార్పొరెట్ ఆస్ప‌త్రులు ఇంత‌టి విల‌యంలోనూ దోపిడీకి పాల్ప‌డ్డాయి.

క‌రోనా జ్వ‌రం పేరుతో ఆస్ప‌త్రి గ‌డ‌ప తొక్కిన పేషెంట్ నుంచి ల‌క్ష‌ల్లో దోపిడీ చేయ‌డ‌మే గాక‌.. ప్రాణానికి  కూడా ఎక్క‌డా గ్యారెంటీ ఇవ్వ‌లేదు. ల‌క్ష‌లు చెల్లించుకుని కూడా ల‌క్ష‌లాది మంది గాల్లో క‌లిసిపోయారు. మార్చురీలో ఎన్ని శ‌వాలున్నాయో.. శ‌వాల గుట్ట‌లో త‌మ వారెవ‌రో కూడా తెలుసుకోలేని ధైన్యంలో కుటుంబాలు న‌లిగిపోయాయి. మ‌హావిల‌యం అంటే ఏమిటో క‌రోనా రుచి చూపించింది. ఆస్ప‌త్రి చావుల్లో అస‌లు లెక్క‌లు లేనివి ఎన్నో కేసులు.

అందుకే ఇప్పుడు కొవిడ్ ఫైల్స్ అన్న సౌండింగ్ విన‌గానే ఇది క‌చ్ఛితంగా కార్పొరెట్ ఆస్ప‌త్రుల ఫైల్స్ కి త‌వ్వ‌క‌మేన‌ని అంతా భావిస్తున్నారు. కార్పొరెట్ ఆస్ప‌త్రుల దోపిడీని ఆప‌లేక‌పోయిన ప్ర‌భుత్వాల చేత‌కాని త‌నాన్ని అస‌మ‌ర్థ‌త‌ను కూడా తెర‌పై చూపిస్తాన‌ని ఆర్జీవీ బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. అవినీతి క‌థ‌ల్ని బ‌య‌ట‌కు తీస్తాన‌ని అన్నాడు.  బ‌హుశా ఆర్జీవీ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే గ‌తంలో ఆయ‌నే తెర‌కెక్కించిన `26/11 ముంబై ఎటాక్స్` ని మించి ఈ సినిమాని ఎమోష‌న‌ల్ గా తెర‌కెక్కించ‌గ‌ల‌రు. కానీ అలా జ‌రుగుతుందా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News