#సుశాంత్.. సీబీఐ ద‌ర్యాప్తు ఇరువ‌ర్గాల‌కు ఓకేనా.. అదెట్టా?

Update: 2020-08-19 23:30 GMT
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం కేసులో ర‌క‌ర‌కాల ట్విస్టులు అంత‌కంత‌కు హీట్ పెంచేస్తున్నాయి. ఓవైపు రియాచ‌క్ర‌వ‌ర్తిపై మ‌నీలాండ‌రింగ్ కేసులో ఈడీ ద‌ర్యాప్తు.. సంచ‌ల‌నం కాగా.. బిహారీ పోలీసుల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ కేసును ముంబై పోలీసులకు బదిలీ చేయాలని కోరుతూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రాంగ‌ణంలో మూడవ సారి విచారణలో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేసింది.

ఈ నిర్ణయాన్ని దివంగత నటుడైన సుశాంత్ కుటుంబం .. స్నేహితులు సహా సోషల్ మీడియాలో ల‌క్ష‌లాది మంది అభిమానులు ప్ర‌శంస‌లు కురిపించారు. ఇదిలా ఉంటే సీబీఐకి కేసును బ‌ద‌లాయించ‌డంపై అటు సుశాంత్ కుటుంబీకులతో పాటు రియా కూడా సంతోషం వ్య‌క్తం చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

తాజా ప‌రిణామంతో ముంబై పోలీసులు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచార‌ణ త‌ర‌హాలోనే రియా సిబిఐ దర్యాప్తును ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ కేసును ఏ ఏజెన్సీ దర్యాప్తు చేసినా త‌న క్లైంట్ ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌నే రియా త‌ర‌పున న్యాయ‌వాది ప్ర‌క‌టించారు.

బుధవారం నాడు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయడమే కాకుండా.. కోర్టు సాక్ష్యాలను అందజేయాలని ముంబై పోలీసులను సుప్రీం కోరింది. ఈ ఉత్తర్వులను సవాలు చేసే అవకాశం ముంబై పోలీసుల‌కు లేకుండా చేసింది సుప్రీం. మహారాష్ట్ర ప్రభుత్వ ప్ర‌మేయాన్ని నిరాకరించింది. దీనిపై స్పందించిన సుశాంత్ కుటుంబ న్యాయవాది ఈ తీర్పును ప్రశంసించారు. ``ఇది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబానికి సాధించిన విజయం. సుప్రీం మాకు అనుకూలంగా అన్ని అంశాలపై తీర్పు ఇచ్చింది. పాట్నాలో నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్ సరైనదని కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది`` అంటూ ఆనందం వ్య‌క్తం చేశారు.

అలాగే రియా చక్రవర్తి న్యాయవాది సతీష్ మనేషిందే ఒక ప్రకటన విడుదల చేస్తూ సుప్రీం కోర్ట్ తీర్పును `కోరుకున్న న్యాయం` అని గౌర‌వ వ‌చ‌నంతో ప్ర‌స్థావించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ``కేసు వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తరువాత సుప్రీం తీర్పు స‌ముచిత‌మైన‌దే. గ‌తంలో సిబిఐ దర్యాప్తుకు రియా స్వయంగా పిలుపునిచ్చినందున అది `కోరుకున్న న్యాయం` అవుతుందని గమనించాలి`` అని ఆయన అన్నారు. మొత్తానికి సుప్రీంలో కూడా రియాకు న్యాయం జ‌రుగుతుంద‌ని రియా చ‌క్ర‌వ‌ర్తి న్యాయ‌వాది ఆశాభావం వ్య‌క్తం చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఓవైపు సుశాంత్ కుటుంబీకులు కూడా సీబీఐకి ద‌ర్యాప్తును బ‌ద‌లాయించ‌డంతో త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఈ కేసులో ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా అస‌లు సిస‌లు నిజాల్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్య‌త బ‌రువు సీబీఐపై ప‌డింది.
Tags:    

Similar News