కన్నడ రాకింగ్ స్టార్ యష్ 'కేజీఎఫ్' చిత్రంతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కన్నడ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన హీరోగానే కాకుండా.. బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లలో కూడా మంచి క్రేజ్ ఏర్పరచుకున్నాడు. నేడు(జనవరి 8) యష్ పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం తాను నటిస్తున్న 'కేజీఎఫ్ చాప్టర్-2' టీజర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. ఇక యశ్ బర్త్ డే ని పురస్కరించుకుని అతని భార్య రాధిక పండిట్ తమ ఇద్దరు పిల్లల సమక్షంలో కేక్ కట్ చేయించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా మధ్యమాలలో షేర్ చేశారు.
ఈ ఫొటోలో యష్ తన శ్రీమతితో కలిసి బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీగా కనిపిస్తున్నాడు. కేక్ కట్ చేసి తన సతీమణికి తినిపించాడు. కాగా, యష్ హీరోయిన్ రాధిక పండిట్ ని 2016లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇప్పుడు ఐరా అనే కుమార్తె.. యధర్వ్ యష్ అనే కుమారుడు ఉన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన 'కేజీఎఫ్ 2' టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నిన్న రిలీజైన ఈ టీజర్ ఇప్పటికే 30 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఇందులో యష్ ఎలివేషన్ సీన్స్.. అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ.. యాక్షన్ సీన్స్.. చివర్లో యష్ సృష్టించిన విధ్వంసం ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా లెవల్లో రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.