'సెల్ఫిష్' గా మారిన రౌడీ బాయ్..!

Update: 2022-04-15 06:30 GMT
''రౌడీ బాయ్స్‌'' చిత్రంతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు సోదరుడు నిర్మాత శిరీష్‌ కుమారుడు ఆశిష్‌ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే హీరోగా ఆశిష్ అరంగేట్రంతో పర్వాలేదనిపించుకున్నాడు. ఈ క్రమంలో ''సెల్ఫిష్'' అనే సినిమాని అనౌన్స్ చేశాడు.

'సెల్ఫిష్' చిత్రాన్ని ఈరోజు శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫస్ట్ షాట్ కు హీరో ఆశిష్ పై క్లాప్ కొట్టిన ధనుష్.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకులు అనిల్ రావిపూడి - హరీష్ శంకర్ - వేణు శ్రీరామ్ లు స్క్రిప్ట్ ను దర్శక హీరోల చేతులకు అందించి విషెస్ తెలియజేసారు.

సుకుమార్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన విశాల్ కాశి 'సెల్ఫిష్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  'ఉప్పెన' సినిమాతో శిష్యుడు బుచ్చిబాబుని డైరెక్టర్ ని చేసిన సుక్కూ.. ఇప్పుడు మరో శిష్యుడు కాశీ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత తీసుకున్నారు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్న 'సెల్ఫిష్' సినిమాకు హర్షిత్ రెడ్డి - హన్షిత రెడ్డి - అశోక్ బండ్రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆశిష్ డెబ్యూ మూవీ 'రౌడీ బాయ్స్' కూడా హోమ్ బ్యానర్ లోనే తెరకెక్కిన సంగతి తెలిసిందే.

'సెల్ఫిష్' సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. యల్లయ్య ఎస్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. చంద్రబోస్ ఈ సినిమాలోని పాటలకు సాహిత్యం రాస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా ఓ పోస్ట‌ర్ ను గురువారం సాయంత్రం మేక‌ర్స్ ఆవిష్కరించారు.

ఇందులో ఆశిష్ డిఫ‌రెంట్ లుక్‌ లో కనిపించాడు. స్లీవ్‌ లెస్ బ్లాక్ జాకెట్ ధరించి స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని యాటిట్యూడ్ చూపిస్తూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. క‌ర్లీ హెయిర్ - గ‌డ్డంతో ఉన్న ఆశిష్ లుక్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే 'సెల్ఫీష్' సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
Tags:    

Similar News