జ‌క్క‌న్న ట్రాక్ రికార్డ్ కి భిన్నంగా 'RRR'

Update: 2021-12-29 08:45 GMT
క్రేజీ సినిమా అంటే దానికి ప్ర‌త్యేక‌మైన సీజ‌న్ ని, ఫెస్టివెల్ డేట్ ని, లేదా స‌మ్మ‌ర్ హాలీడేస్ ని టార్గెట్ చేసుకుని రిలీజ్ చేస్తుంటారు. కానీ కొంత మంది మాత్రం త‌మ సినిమా విడుద‌లైన సీజ‌నే ప్ర‌త్యేకం అని భావిస్తూ సీజ‌న్‌, ఫెస్టివెల్ అని సంబంధం లేకుండా.. అలాంటి లెక్క‌లేవీ వేసుకోకుండా రిలీజ్ చేసేస్తుంటారు ట్రెండ్ కి భిన్నంగా వెళుతూ విజ‌యాలు సాధిస్తూ వుంటారు కొంత మంది ద‌ర్శ‌క హీరోలు. అయితే అందులో రాజ‌మౌళి కున్న ట్రాక్ రికార్డ్ పూర్తిగా భిన్నం.

ఆయ‌న చేసిన చాలా సినిమాలు పండ‌గ‌ల సీజ‌న్ , స‌మ్మ‌ర్ సీజ‌న్ అని ఎప్పుడూ రిలీజ్ కాలేదు. ఎప్పుడు టైమ్ దొరికితే అప్పుడు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా.. ఇండ‌స్ట్రీ దిశ‌ని మార్చే చిత్రాలుగా జేజేలందుకున్నాయి. ఇదీ జ‌క్క‌న్న ట్రాక్ రికార్డ్. అయితే ఆయ‌నా తాజాగా త‌న ట్రాక్ కి భిన్నంగా తొలిసారి అడుగులు వేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జ‌క్క‌న్న త‌న‌ ట్రాక్ రికార్డ్ కి భిన్నంగా త‌ను రూపొందించిన `ఆర్ ఆర్ ఆర్` ని ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేశారు. ఆ త‌రువాత క‌రోనా దెబ్బ‌తో సీజ‌న్ మారింది.

సంక్రాంతి సీజ‌న్ ని టార్గెట్ చేసుకున్నారు. ఇలా సీజ‌న్ ని టార్గెట్ చేసుకుని బ‌రిలోకి దిగ‌డం జ‌క్క‌న్న‌కు తొలిసారి. త‌న ట్రాక్ రికార్డ్ కి పూర్తి భిన్నంగా `ఆర్ ఆర్ ఆర్‌` ని సంక్రాంతి బ‌రిలో దింపేస్తున్న రాజ‌మౌళి ఈ సినిమా ప్ర‌చార ప‌ర్వాన్ని నెల రోజుల ముందుగానే ప్రారంభించి అంద‌రికి షాకిచ్చారు. త‌నే ప్ర‌చార ప‌ర్వాన్ని డిజైన్ చేసి హోరెత్తిస్తున్నారు. తెలుగులో ప్ర‌చారాన్ని ప‌క్క‌న పెట్టి ఉత్త‌ర భార‌తంలో `ఆర్ ఆర్ ఆర్‌` కి భ‌లే క్రేజ్‌ని తీసుకొచ్చే ప‌నిలో బిజీ అయిపోయారు.

అయితే త‌న ట్రాక్ రికార్డ్ కి భిన్నంగా అడుగులు వేస్తున్న రాజ‌మౌళికి ఆది నుంచి హంస పాదు అన్న‌ట్టుగానే సాగుతోంది. ముందు ద‌స‌రా అనుకున్నారు. అది కాస్తా మారి సంక్రాంతికి చేరింది. ఇప్పుడు ఢిల్లీ, ముంబైల్లో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల నేప‌థ్యంలో చాలా వ‌రకు బాలీవుడ్ చిత్రాల రిలీజ్ ల‌ని వాయిదా వేస్తున్నారు. షాహీద్ కపూర్ న‌టించిన `జెర్సీ` రిలీజ్ ని ఈ నెల 31 నుంచి వాయిదా వేశారు. దీంతో `ఆర్ ఆర్‌ ఆర్` ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

అంతే కాకుండా క‌ర్ణాట‌క లోనూ ఈ సినిమాకు ప్ర‌తికూల వాతావ‌రణం క‌నిపిస్తోంది. ఢిల్లీ, ముంబై న‌గ‌రాల‌తో పాటు క‌ర్ణాట‌క‌లోనూ రాత్రి క‌ర్ఫ్యూని విధించారు. ఇక ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితి అదులోనే వున్నా.. ఏపీలో మాత్రం టికెట్ రేట్ల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఇదే ఇప్పుడు రాజ‌మౌళికి టెన్ష‌న్ పుట్టిస్తోంది. ఇండియాలో ప‌రిస్థితి ఇలా వుంటే మూఎస్ లో ఒమిక్రాన్ ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తూ భయాందోళ‌న‌ల‌కు గురిచేస్తోంది. అయినా ఈ మూవీ ప్రీ రిలీజ్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జ‌రుగుతున్నాయి.

అయితే రిలీజ్ కు ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా లేని నేప‌థ్యంలో ప‌రిస్థితులు ఎలా మారుతాయోన‌ని కొంత మంది సినీ జ‌నం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై త‌ర‌హాలో దేశ వ్యాప్తంగా మ‌రిన్ని రాష్ట్రాలు రాత్రి క‌ర్ఫ్యూని ప్ర‌కటిస్తే `ఆర్ ఆర్ ఆర్ ` కు గ‌డ్డు ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే గ‌న‌క జ‌రిగితే ఊహించిన స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం క‌ష్ట‌మే అంటున్నారు. దీంతో రాజ‌మౌళి మొద‌టి సినిమాకు కూడా ఇలాంటి ప‌రీక్ష‌లు ఎదుర్కోలేద‌ని, మ‌రీ ప‌రిస్థితులు దారుణంగా మార‌బోతున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు పెద‌వి విరుస్తున్నాయి.

Tags:    

Similar News