రాజమౌళి మల్టీస్టారర్.. ఇంకొంచెం లేటుగా

Update: 2018-07-11 06:36 GMT
‘బాహుబలి’ లాంటి రికార్డ్ బ్రేకింగ్ సినిమా తీశాక రాజమౌళి నుంచి వచ్చే సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో కొత్తగా చెప్పేదేముంది? ఈ అంచనాల ఒత్తిడిలో ఓ కథ సిద్ధం చేయడం సవాలుతో కూడుకున్న విషయమే. అందుకే ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలై ఏడాది దాటుతున్నా ఆ కథ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఐతే రాజమౌళి మీద ఉన్న నమ్మకం వల్ల కనీసం లైన్ కూడా చెప్పకున్నా ఈ సినిమాకు ఓకే చెప్పేశారు జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్. ప్రస్తుతం వాళ్లిద్దరూ వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీగా ఉండగా.. అవి పూర్తయ్యే సమయానికి రాజమౌళి స్క్రిప్టు రెడీ చేసి పెడతాడని ఆశిస్తున్నారు. కానీ ఈ చిత్ర బృందం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తారక్-చరణ్ ఫ్రీ అయ్యే సమయానికి కూడా రాజమౌళి స్క్రిప్టు సిద్ధం కాదట.

దాదాపు ఏడాది నుంచి ఈ స్క్రిప్టు మీద పని చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కథ ఓ కొలిక్కి రాలేదని సమాచారం. చిన్న చిన్న విషయాల్లోనూ రాజీ పడని రాజమౌళి.. ఈ మెగా మల్టీస్టారర్ విషయంలో మరింత కచ్చితంగా ఉంటున్నాడట. అందుకే కథలో కొన్ని ఎపిసోడ్లు ఇంకా ఫైనలైజ్ కాలేదని సమాచారం. డెడ్ లైన్ ఏమీ పెట్టుకోకుండా పని కొనసాగిస్తూనే ఉన్నారట. ముందు అనుకున్న ప్రకారమైతే అక్టోబరు లేదా నవంబరులో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లాల్సింది. కొన్ని నెలల కిందటే ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ల నిర్మాణం కూడా జరుగుతోంది. ఐతే ఈ పని సంగతెలా ఉన్నా.. స్క్రిప్టే అన్నిటికన్నా ముఖ్యం. దాని వల్ల షూటింగ్ ఇంకో ఒకట్రెండు నెలలు ఆలస్యం కావచ్చని.. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా సెట్స్ మీదికి వెళ్లొచ్చని అంటున్నారు.
Tags:    

Similar News