'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ ఏ స్టేజ్ లో ఉందంటే..?

Update: 2021-05-28 17:30 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ పై అంచనాలు ఏ స్టాయిలో ఉన్నాయో చెప్పక్కర్లేదు. ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి కె.వి.విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో షూటింగ్స్ జరగకపోవడంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో మూడేళ్ళుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా మళ్ళీ వాయిదా అంటున్నారు.. అసలు ట్రిపుల్ షూటింగ్ ఎక్కడి దాకా వచ్చింది అనే ఆసక్తి అందరిలోనూ ఎక్కువైంది.

అయితే సినీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ భారీ క్లైమాక్స్ తో సహా దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. కొంత ప్యాచ్ వర్క్ మరియు రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఒక వారం రోజులు షూట్ చేస్తే టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుందని అంటున్నారు. అలానే సారధి స్టూడియో మరియు అన్నపూర్ణ స్టూడియోలోనూ ఇప్పటికే నిర్మించిన సెట్స్ లో పెండింగ్ ఉన్న రెండు పాటలను తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో ఒకటి రామ్ ‌చరణ్‌ - ఆలియా భట్ లపై చిత్రీకరించాల్సి రొమాంటిక్ సాంగ్. మరొకటి సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తూ తారక్ - చరణ్ ల మధ్య వచ్చే స్పెషల్ సాంగ్. ఈ రెండూ కూడా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

షూటింగ్స్ కి అనుమతి వచ్చిన వెంటనే 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ కార్యక్రమాలు మొదలవుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి సినిమా విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ డీల్స్ అన్నీ దాదాపుగా క్లోజ్ అయ్యాయి. భారతీయ భాషలతో పాటుగా ఐదు విదేశీ భాషల్లో రిలీజ్ కానుంది. డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కలిగియున్న పెన్ స్టూడియోస్ వారు పది భాషల రైట్స్ ని లాభాలకు అమ్మారు. ఈ భారీ డీల్ తో RRR నిర్మాత డీవీవీ దానయ్య - డైరెక్టర్ రాజమౌళి భారీ లాభాలు పొందినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News