RRR కొత్త విడుదల తేదీ ప్రకటన.. అలియా కు షాక్ ఇచ్చిన జక్కన్న..!

Update: 2021-10-02 12:57 GMT
'బాహుబలి' వంటి విజువల్ వండర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో అలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎదురు చూపులకు తెర దించుతూ తాజాగా మేకర్స్ ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు.

RRR చిత్రాన్ని 2022 జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఈ సందర్భంగా తారక్ - చరణ్ - ఆలియా - అజయ్ దేవగన్ లతో కూడిన ఓ సరికొత్త పోస్టర్ ని వదిలారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆర్.ఆర్.ఆర్ తేదీని ప్రకటించడంతో.. మిగతా సినిమాల విడుదల విషయంలో గందరగోళం ఏర్పడే పరిస్థితి వచ్చింది. డిసెంబర్ లో క్రిస్మస్ మొదలుకొని సంక్రాంతి వరకు అనేక సినిమాలు రిలీజ్ డేట్స్ ని లాక్ చేసి పెట్టుకున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా RRR డేట్ రావడంతో సంక్రాంతి కి వచ్చే పెద్ద సినిమాలు డైలమాలో పడేసినట్లే.

సంక్రాంతి సీజన్ లో 'భీమ్లా నాయక్' 'సర్కారు వారి పాట' 'రాధే శ్యామ్' చిత్రాలను రిలీజ్ చేసుకోడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకున్నారు. వీటిలో ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 14న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా జనవరి 7న వస్తుందని ప్రకటించడంతో మిగతా రెండు సినిమాల పరిస్థితి ఏంటనే కన్ఫ్యూజన్ సినీ అభిమానుల్లో మొదలైంది. నిజానికి దసరా కానుకగా అక్టోబర్ 13న RRR విడుదల ఫిక్స్ చేయడంతో అప్పుడు కూడా చాలా సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి గందరగోళం సృష్టించింది. మరి త్వరలోనే మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఇకపోతే ఇప్పుడు జక్కన్న అండ్ టీమ్ తీసుకున్న నిర్ణయంతో అలియా భట్ వెర్సెస్ అలియా భట్ అనే విధంగా మారింది. ఎందుకంటే అలియా భట్ - సంజయ్ లీలా బన్సాలీ కాంబోలో రూపొందిన 'గంగుబాయి కథివాడి' చిత్రాన్ని 2022 జనవరి 6న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు జనవరి 7ను RRR డే గా అనౌన్స్ చేశారు. దీంతో అలియా భట్ నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి వస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. 'ఆర్.ఆర్.ఆర్' మరియు 'గంగుబాయి' చిత్రాలు రెండూ పెన్ స్టూడియోస్ వారికే చెందినవే అవడం. ఒక్క రోజు గ్యాప్ తో రెండు పాన్ ఇండియా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి 'పెన్' సంస్థ ధైర్యం చేసిందనే చెప్పాలి. ఇవి ఒకదానితో ఒకటి పోటీ పడటమే కాకుండా.. 'రాధే శ్యామ్' ని కూడా ఢీ కొట్టాల్సి ఉంటుంది. మరి సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఏమి జరుగుతుందో చూడాలి.

కాగా, 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఫిక్షనల్ కథాంశంతో రూపొందిస్తున్నారు. అల్లూరిగా రామ్ చరణ్ - భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ఇద్దరు హీరోల టీజర్స్ - దోస్తీ సాంగ్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాసారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News