#RRR అన్ని ప్ర‌శ్న‌ల‌కు స్క్రీన్ ప్లేనే స‌మాధానం

Update: 2020-07-23 03:45 GMT
బాహుబ‌లి రిలీజ్ స‌మ‌యంలో ఎన్నో సందేహాలు. రాజులు-రాజ్యాలు-పోరాటాలు-పాట‌లు.. ఇవేనా సినిమా అంతా? ఇంకేమీ ఉండ‌దా?  రాజ‌మౌళి ఇంకేదో చూపించాల్సింది అంటూ ర‌క‌ర‌కాలుగా స‌మీక్ష‌కులు త‌మ సూచ‌న‌లు చేశారు. ఉత్త‌రాది స‌మీక్ష‌కుల‌తో పోలిస్తే ద‌క్షిణాది స‌మీక్ష‌కులే ఇలాంటి ప్ర‌శ్న‌లెన్నో వేశారు. అయితే ఏ ప్ర‌శ్న‌తోనూ ప‌ని లేకుండా ఆ సినిమా విజ‌యం సాధించింది. కానీ ఈసారి ఆర్.ఆర్.ఆర్ విష‌యంలో అలా జ‌రుగుతుందా?

ప్ర‌శ్నించ‌నిదే స‌మీక్ష‌కులు నిదుర‌పోరు. ఏదో ఒకటి ప‌ట్టుకుని రాజ‌మౌళిని ఇర‌కాటంలో పెట్ట‌కుండా ఉండ‌రు. అయితే ఇది చాలా ముందే గ్ర‌హించిన ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇచ్చిన ప్రీప్లాన్డ్ ఆన్స‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కథ చాలా సున్నితంగా ఉంటుంది. రిలీజ్ వేళ ఎవ‌రైనా ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తినా కానీ వాటికి రాజ‌మౌళి స్క్రీన్ ప్లే స‌మాధానం ఇస్తుంది!! అంటూ ఘంటాప‌థంగా చెప్పారు. దీనిని బ‌ట్టి ఈ మూవీ మేకింగ్ విష‌యంలో జ‌క్క‌న్న ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. ``రౌద్రం రణం రుధిరం`` అన్న ట్యాగ్ లైన్ కి త‌గ్గ‌ట్టే చ‌ర‌ణ్‌-తార‌క్ పాత్ర‌ల్ని ఎంతో ఔచిత్యంతో రూపొందించి అద్భుత క‌థ‌నంతో తెర‌పై ఆవిష్క‌రిస్తున్నార‌ని భావించ‌వచ్చు.

అయితే రాజ‌మౌళి మేకింగ్ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహాలు లేవు కానీ.. ప్ర‌స్తుత ఆప‌త్కాలంపైనే అంద‌రికీ సందేహం. ఇప్పుడున్న స‌న్నివేశంలో థియేట్రిక‌ల్ రిలీజ్ కి ఆస్కారం క‌నిపించ‌డం లేదు. అస‌లు షూటింగ్ ఎప్ప‌టికి పూర్త‌వుతుందో వీఎఫ్.ఎక్స్ ఎప్ప‌టికి పూర్త‌వుతుంది? అన్న‌దానిపైనా క్లారిటీ లేదు. వ్యాక్సిన్ వ‌చ్చేదెపుడు?  థియేట‌ర్లు తెరిచేదెపుడు?  పాన్ ఇండియా సినిమాలు రిలీజై రికవ‌రీ చేయ‌డ‌మెలా?  జ‌నం మ‌హ‌మ్మారీకి భ‌య‌ప‌డి థియేట‌ర్ల వైపు చూడ‌క‌పోతే ప‌రిస్థితి ఏమిట‌న్న‌దే చిక్కు ప్ర‌శ్న‌. ఈ ప్ర‌శ్న‌కు విజ‌యేంద్రుని వ‌ద్ద కానీ.. రాజ‌మౌళి వ‌ద్ద కానీ స‌మాధానం దొరుకుతుందంటారా?
Tags:    

Similar News